ఎట్టకేలకు సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. తెరపై బొమ్మ పడబోతోంది. దాదాపు ఏడు నెలలుగా ఇంట్లో బుల్లితెర వినోదానికే పరిమితమైన ప్రేక్షకులు... థియేటర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. పక్కాగా తేదీలు ఖరారు కాలేదు కానీ... వచ్చే నెలలోనే ప్రదర్శనలు షురూ కానున్నాయి. హాళ్లను ముస్తాబు చేసే పనుల్లో బిజీ అయిపోయారు ప్రదర్శనకారులు. నిర్మాతలు సినిమాల విడుదల తేదీల గురించి కసరత్తులు చేయడం మొదలుపెట్టారు. మరి ప్రేక్షకుడి స్పందన ఎలా ఉండనుంది? ఓటీటీ.. ఏటీటీ అంటూ కొత్తగా అలవాటైన మాధ్యమాల్ని వదిలి థియేటర్‌కు రావడానికి సిద్ధంగానే ఉన్నారా? ఇదివరకటిలా ఉత్సాహంగా టికెట్టు కొంటారా? ఈ సందేహాలే సినీ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. కొత్త సినిమాల విడుదల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తున్నాయి.
థియేటర్లు తెరవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు రావడం వల్ల.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కొత్త చిత్రం 'కరోనా వైరస్' విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న తొలి చిత్రమిద'ని కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇది నిజ జీవిత హారర్ చిత్రమని పేర్కొన్నారు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా..వర్మ, అన్నపు రెడ్డి ఎల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
థియేటర్‌కు సవాళ్లు కొత్త కాదు. పైరసీ... విపత్తులు... కొత్త మాధ్యమాలు... ఇలా అడుగడుగునా ఆటంకాలు. వీటన్నింటినీ అధిగమిస్తూ థియేటర్ తన ప్రత్యేకతను చాటుకుంది. మంచి సినిమా విడుదలైన ప్రతిసారీ... ప్రేక్షకుల్ని ఆకర్షించింది. వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈసారి ఎదురైంది మామూలు సవాల్ కాదు. ... మహమ్మారి కరోనా! నెలలపాటు తెరపై బొమ్మ పడకుండా చేసింది. నిర్మాణాలు ఆగిపోయేలా చేసింది. కొత్త మాధ్యమాలకు ప్రేక్షకుడు మరింతగా అలవాటుపడేలా చేసింది. థియేటర్ల ఉనికిని ప్రశ్నార్థకం చేసే పరిణామాలు ఇవన్నీ. అయితే సినిమాను జీవితంలో ఓ భాగం చేసుకున్న ప్రేక్షకుడు థియేటర్ అనుభూతిని అంత సులభంగా దూరం చేసుకుంటాడా? తొలి రోజు... తొలి ఆట అంటూ ఉత్సాహం ప్రదర్శించే కథానాయకుల అభిమానులకు థియేటర్ అందుబాటులో ఉందంటే... అభిమాన కథానాయకుడి సినిమా విడుదలైందంటే ఊరికే ఉంటారా? ఆ అవకాశమే లేదంటున్నాయి సినీ వర్గాలు. ఓటీటీ ప్రేక్షకులు వేరు, థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు వేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద చిత్రసీమలో భయాలతోపాటు, ఈసారి ఎదురైన సవాల్‌నీ అధిగమిస్తామన్న ఆత్మ విశ్వాసం కూడా చిత్రసీమలో కనిపిస్తోంది. అందుకే ఒకపక్క కరోనా భయం వెంటాడుతున్నా... మరోపక్క సిద్ధమైన తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. ఈ పరిణామాలపై సినీ పెద్దలు ఏమంటున్నారంటే..?
కథాబలముంటే టికెట్లు తెగుతాయి
"కరోనా భయాలు కొన్నాళ్లున్నా... మంచి సినిమా వచ్చిందంటే మళ్లీ ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు. ఓటీటీ వేదికల ప్రభావం మన థియేటర్లపై తక్కువే. అయినా ఓటీటీ వేదికలు ఎంత మందికి అందుబాటులో ఉంటాయి. ఒక శాతం, రెండు శాతం. అదీ సిటీల్లోనే. మిగిలినవాళ్లంతా థియేటర్లలోనే సినిమా చూస్తారు కదా. ఓటీటీ వేదికలు వచ్చినా అవి ఏడాదికి ఎన్ని సినిమాలు కొంటాయి? మన దగ్గర యేడాదికి 200 సినిమాలు విడుదలవుతాయి. ఓటీటీ సంస్థలు కొంటే 20, 30 సినిమాలు కొంటాయి. మిగతావి థియేటర్లలో విడుదల కావల్సిందే కదా. కంటెంటే ముఖ్యం. మంచి కథ లేని సినిమాలు ఇంతకుముందు ఆడలేదు, ఇకపైనా ఆడవు. ఇప్పుడు యాభై శాతం మంది ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నడుస్తాయి కాబట్టి... ఇకపైన కథాబలమున్న సినిమాలకూ పర్సెంటీజీలు తగ్గుతాయి. ప్రదర్శనకారులకు థియేటర్ల నిర్వహణ భారం పెరుగుతుంది. ఇదివరకటితో పోలిస్తే పదిశాతం ఖర్చులు పెరుగుతాయి. వీటన్నిటినీ తట్టుకోవాలి".
- తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత
ఆ ప్రభావం ఎప్పటికీ పోదు
"మంచి సినిమాలతో మళ్లీ ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావల్సిందే. ఆ బాధ్యత మాపైన ఉంది. ధనిక, పేద అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ సెల్‌ఫోన్ పట్టుకుని సినిమాలు చూసేస్తున్నారు. ఒకొక్కసారి ఒక్కో మాధ్యమంపై ప్రేక్షకుడికి మనసు మళ్లుతుంటుంది. వాటన్నిటినీ పక్కనపెట్టి థియేటర్‌కు వచ్చేలా చేయడమే కీలకం. మనం తీస్తున్న సినిమాను గుర్తు చేసుకుని థియేటర్‌లో చూడాల్సిందే అనుకునేలా ప్రేక్షకుడిని ప్రభావితం చేయాలి. సినిమాకు ఆ గ్లామర్‌ను తీసుకురావాలి. ఎన్ని రకాల పోటీ ఎదురైనా... సినిమా థియేటర్ ఎప్పుడూ తన ప్రాభవాన్ని కోల్పోదు."
- సి.కల్యాణ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు
రెండు రోజుల్లో నిర్ణయం
"ప్రేక్షకుడు ఓటీటీకి అలవాటు పడ్డాడా లేదా? థియేటర్‌కు వస్తాడా రాడా? అనే విషయాలపై ఎవరి ఊహాగానాలు వాళ్లవి. ఏం జరగబోతోందనేది ఎవ్వరికీ తెలియదు. థియేటర్లు ప్రారంభించాక ప్రేక్షకుడి ఆలోచన ఎలా ఉంటుంది? కంటెంట్ పవర్ ఎలా ఉంటుందనే విషయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. థియేటర్లు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే తప్ప ఏమీ చెప్పలేం. మొదట ప్రేక్షకుడిలోని భయం పోవాలి. థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామనే ధైర్యమైతే ఇవ్వాలి. అన్ని వ్యాపారాల్లోనూ భయాలు ఉన్నట్టే, సినిమా వ్యాపార వర్గాల్లోనూ ఉంది. థియేటర్లను ప్రారంభించే తేదీ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం".
- కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి
క్రిస్మస్‌కు... విడుదల
సాయితేజ్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై తెరకెక్కిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. నభా నటేశ్ కథానాయిక. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోతో కలిసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.
కథానాయకుడు మాట్లాడుతూ.. "ప్రేక్షకులకు మళ్లీ థియేటర్‌లో వినోదం పంచడం కోసమే మేం చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇన్ని రోజులు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్ని మరిచిపోయేలా ఆద్యంతం నవ్విస్తూ, ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతుంది" అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. "క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది" అన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.