'బిగ్‌బాస్ సీజన్-5' ఆరో వారంలో హౌస్ నుంచి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడం వల్ల ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం మొత్తం 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. గత సోమవారం వాడీవేడీ చర్చల మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు. శనివారం లోబో ఎలిమినేట్ అయ్యాడంటూ అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఆదివారం శ్వేత ఎలిమినేషన్‌ను ప్రకటించారు.
'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ'లో తయారు చేసిన బొమ్మలే ఈ వారం హౌస్మేట్స్ భవితవ్యాన్ని తేల్చాయి. నాగార్జున కూడా అదే విషయం చెప్పారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందికి బొమ్మలు ఇచ్చారు. ఎవరి ఫొటో అయితే బొమ్మలో ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. చివరకు శ్వేత-సిరిలు మిగలగా, శ్వేత ఎలిమినేట్ అయి, సిరి సేఫ్ అయింది. ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే, శ్వేత తొలి నుంచి కాస్త అగ్రెసివ్‌గా ఆడారు. నామినేషన్స్ సందర్భంగా ఒకట్రెండు సార్లు శ్వేత సహనం కోల్పోయింది. ఆ తర్వాత నాగార్జున ముందు చెప్పలేసుకుంది.
ఇక కాజల్-శ్వేత తరచూ గొడవ పడుతుండేవారు. టాస్క్‌ల సమయంలో శ్వేత తనదైన ఆటతీరు కనబరిచింది. అయితే, బొమ్మల తయారీ సందర్భంగా రవి సూచన మేరకు ఇంటిలోని కుషన్‌ను కట్ చేసి, బొమ్మలు తయారు చేయడంతో కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోవడంతో పాటు, నాగార్జునతోనూ తిట్లు తిన్నారు. ఇక అనీ మాస్టర్ శ్వేతను తన కూతురుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హౌస్ వీడి వెళ్లే సమయంలో ఇంటి సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
లోబోకు నాగోపదేశం!
ఇక బిగ్‌బాస్ చెప్పేవరకూ లోబో సీక్రెట్ రూమ్‌లో ఉండాలని నాగార్జున సూచించారు. చిన్నప్పటి నుంచి తనకు అబద్ధాలు చెప్పటం రాదని, హౌస్‌లోకి వచ్చిన తర్వాత అబద్ధాల మధ్య ఉండలేకపోతున్నానని లోబో చెప్పాడు. దీనికి సంబంధించిన నాగార్జున 'మొదటి నుంచి నీ జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండానే సాగిందా? సీక్రెట్ రూమ్‌లో ఉండి, హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఎలా ప్రవర్తించాలో తెలుసుకో' అంటూ గీతోపదేశం చేశారు. అందుకు 'సరే'నంటూ లోబో తలూపాడు.
ఇదీ చదవండి: