చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: సుబ్బు
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సమర్పణ: జీ స్టూడియోస్
విడుదల: 25-12-2020
థియేటర్లలో శుక్రవారం (డిసెంబరు 25) నుంచి మళ్లీ జోష్ మొదలైంది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త సినిమా సందడిని రుచి చూశాయి. క్రిస్మస్ సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదల కావడం వల్ల... ప్రేక్షక, పరిశ్రమ వర్గాలు ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేశాయి. దీని ఫలితంపైనే మిగతా సినిమాల రిలీజ్‌లు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని ఈ సినిమా ఏ మేరకు సంతృప్తి పరిచింది? గతేడాది 'ప్రతి రోజు పండగ'తో విజయాన్ని అందుకున్న సాయితేజ్ దాన్ని పునరావృతం చేశారా?
కథేంటంటే:
విరాట్ (సాయి తేజ్) సోలో బ్రతుకే సో బెటర్ అని చెబుతూ తోటి స్నేహితులతో కలిసి కాలేజీలో సోలో క్లబ్‌ను నడుపుతుంటాడు. సోలో జీవితంపై శ్లోకాలతో కూడిన ఓ బుక్ కూడా రాస్తాడు. అలాంటి కుర్రాడు ఓ దశలో సోలో జీవితానికి పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటాడు. జోడీని వెదుక్కునే పనిలో ఉన్న అతని జీవితంలోకి అమృత (నభా నటేష్) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోలో జీవితం గురించి అంతగా చెప్పిన విరాట్ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? అమృత.. విరాట్ జీవితంలోకి రావడం వెనక కారణమేమిటి? వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే:
పెళ్లి అయిన వాళ్లకీ, కాని వాళ్లకైనా ఎవరికైనా సులభంగా కనెక్ట్ అయ్యే కథ ఇది. కొత్త దర్శకుడు సుబ్బు ఈ కథను రాసుకున్న విధానం, ఒక చిన్న అంశాన్ని ఫార్ములా తరహాలో విస్తరించిన ప్రయత్నం కూడా మెచ్చుకోతగినదే. కానీ, ఆ కథ నుంచి హాస్యాన్ని, భావోద్వేగాల్ని రాబట్టడంలో విఫలమయ్యారు. ప్రథమార్ధం సరదాగా సాగినట్టు అనిపించినా, ద్వితీయార్ధంలో మాత్రం ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ నీరసంగా ముగుస్తుంది. కొన్ని సన్నివేశాలు పునరావృతం అవుతున్నట్లుగా ఉంటాయి. ఒంటరి జీవితం గురించి ఫిలాసఫీ చెబుతూ, ఎంతో మందిని ఆ తరహా జీవితం వైపు ఆకర్షితుల్ని చేసిన ఓ కుర్రాడు ఎలా మారాడనే విషయంలోనే ఈ సినిమా ఆత్మ ఉంది. కానీ, ఆ సన్నివేశాల్లోనే బలం లేదు. విరాట్ మావయ్య (రావు రమేశ్) తన భార్య చనిపోయాక ఆమె విలువ తెలుసుకోవడం, ఆ విలువ గురించి విరాట్‌కు వివరించే సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ఆ భావోద్వేగాల స్థాయి మాత్రం సినిమాకు సరిపోలేదు.
ద్వితీయార్ధంలోనూ రావు రమేశ్ పాత్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో భావోద్వేగాలు మెండుగా పండాల్సి ఉన్నా.. చప్పగా సాగినట్టు అనిపిస్తాయి. ప్రథమార్ధంలో కామెడీపై దర్శకుడు చేసిన కసరత్తులు పర్వాలేదనిపిస్తాయి. తనతో పాటు నడిచిన స్నేహితులు ఒక్కొక్కరుగా జారుకోవడం, ఇంటి ఓనర్ అబ్బాయి గోవింద్ (వెన్నెల కిషోర్) పెళ్లి, అతను మాట్లాడే కన్నడ భాష నవ్విస్తాయి. ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి కామెడీ మోతాదు తక్కువ కావడం, విరాట్ - అమృతల మధ్య వచ్చే సన్నివేశాల్లో బలం లేకపోవడం, పతాక సన్నివేశాలు కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగడం వల్ల సినిమా పర్వాలేదనిపించే స్థాయిని మించలేకపోయింది.
ఎవరెలా చేశారంటే:
సాయి తేజ్ నటన ఆకట్టుకుంటుంది. విరాట్‌గా పాత్రలో ఒదిగిపోయిన విధానం, ప్రథమార్ధంలో ఆయన హుషారుగా కనిపిస్తూ చేసే సందడి మెప్పిస్తుంది. నభా నటేష్ పాత్ర విరామానికి ముందు ప్రవేశిస్తుంది. ఆమె పాత్ర రాకతో చోటు చేసుకునే మలుపు కీలకం. ద్వితీయార్ధంలో అందంగా కనిపిస్తూ, సోలో జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అమ్మాయిగా ఆమె చేసే సందడి మెప్పిస్తుంది. రావు రమేశ్ పాత్ర, ప్రథమార్ధంలో ఆ పాత్రతో పండించిన భావోద్వేగాలే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నవ్వించే బాధ్యతను వెన్నెల కిషోర్ భుజాన వేసుకున్నారు. సత్య, సుదర్శన్ తదితర హాస్యనటులున్నా.. వెన్నెల కిషోరే ఎక్కువగా నవ్వించారు.
రాజేంద్రప్రసాద్, నరేశ్, అజయ్ తదితర నటులున్నా.. వాళ్ల పాత్రల పరిధి చాలా తక్కువ. సాంకేతిక విభాగాలు చక్కటి పనితీరుని ప్రదర్శించాయి. తమన్ పాటలు, నేపథ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. వెంకట్ సి. దిలీప్ కెమెరా పనితనం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు సుబ్బు కథ కోసం ఎంచుకున్న అంశం బాగుంది. మాటలు మెరిపిస్తాయి. కథనం పరంగా, భావోద్వేగాల పరంగా మాత్రం మరిన్ని కసరత్తులు చేయాల్సింది.
బలాలు
+ ప్రథమార్ధం
+ సాయి తేజ్ నటన
+ సంగీతం, రావు రమేష్ పాత్ర
బలహీనతలు
- భావోద్వేగాలు పండక పోవటం
- ద్వితీయార్ధంలో హాస్యం
చివరిగా: హీరోకు సోలో ఆలోచనలు ఉన్నంత వరకే సినిమా బెటర్!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: థియేటర్లు తెరుచుకున్నాయ్.. మరి ప్రేక్షకులు వస్తారా?