చిత్రం: హీరో
నటీనటులు: రిషభ్ శెట్టి, గన్వి లక్ష్మణ్, ప్రమోద్‌శెట్టి, అనిరుధ్ మహేశ్, ప్రదీప్ శెట్టి, మంజునాథ్ గౌడ తదితరులు
సంగీతం: బి.అజనీశ్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్.కశ్యప్
ఎడిటింగ్: ప్రతీక్‌శెట్టి
నిర్మాత: రిషభ్‌శెట్టి
రచన: ఎం. భరత్ రాజ్, అనిరుధ్ మహేశ్
దర్శకత్వం: ఎం.భరత్‌రాజ్
విడుదల: ఆహా
అటు వైవిధ్య చిత్రాలతో పాటు, ఇటు భారీ యాక్షన్ మూవీలతో పాన్ ఇండియా స్థాయిలో కన్నడ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు, నటులు సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నారు. ఎం.భరత్‌రాజ్ దర్శకత్వంలో రిషభ్‌శెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'హీరో'. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కరోనా కాలంలో అతి తక్కువ మందితో ఒకే లొకేషన్‌లో ఈ సినిమాను పూర్తి చేశారు. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటి? 'బెల్ బాటమ్' ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన రిషభ్ శెట్టి ఇందులో ఎలా అలరించారు? అనేది సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
హీరో(రిషభ్‌శెట్టి) ప్రేమలో విఫలమై ఒక బార్బర్ షాపులో పనిచేస్తుంటాడు. హీరోయిన్(గన్వి లక్ష్మణ్)పై పగ పెంచుకుంటాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలనుకుంటాడు. ఆమె విలన్(ప్రమోద్‌శెట్టి)ను వివాహం చేసుకుంటుంది. ఊరికి దూరంగా అడవిని తలపించే ఫామ్ హౌస్‌లో మందీ మార్బలంతో విలన్ నివసిస్తుంటాడు. అతని అనుమతి లేకుండా పురుగు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో విలన్‌కు హెయిర్‌కట్ చేయడానికి హీరో వెళ్లాల్సి వస్తుంది. హీరోయిన్‌ను చంపి తన పగ కూడా తీర్చుకున్నట్లు ఉంటుందని అనుకుని ఆ బంగ్లాకు వెళ్తాడు. మరి హీరోయిన్‌ను హీరో చంపాడా? విలన్ ఏం చేశాడు? ఈ క్రమంలో హీరో-హీరోయిన్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది కథ.
ఎలా ఉందంటే?
హీరో-హీరోయిన్ ప్రేమించుకోవటం.. హీరో ఇష్టపడిన అమ్మాయినే విలన్ కూడా ఇష్టపడటం.. ఆమెను బలవంతంగా విలన్ తీసుకెళ్లడం.. రామాయణాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అన్ని భాషల్లో కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి హీరో నేరుగా వెళ్లి విలన్‌తో వీరోచితంగా పోరాటం.. రెండు విలన్ గుంపులో చేరి అతడికి తెలియకుండానే అన్ని రకాలు దెబ్బ కొట్టడం.. ఇప్పటివరకూ ఇలాంటి కథలే వచ్చాయి. కానీ, రిషభ్‌శెట్టి 'హీరో' మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తనని కాదని వెళ్లిపోయిన హీరోయిన్‌ను హీరో హత్యచేయాలనుకోవడం సరికొత్త పాయింట్. ఈ కథా వస్తువును తీసుకుని ప్రేక్షకులను అలరించేలా సినిమా తీయడంలో దర్శకుడు ఎం.భరత్‌రాజ్ విజయం సాధించారు.
హీరో, హీరోయిన్‌ల ప్రేమకథను, విలన్ క్రూరత్వాన్ని పరిచయం చేస్తూ దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయా సన్నివేశాల్లో కథాగమనం నెమ్మదిగా ఉంటుంది. అయితే, అది విసుగనిపించకుండా పాత్రల మధ్య జరిగే సంభాషణల్లో సునిశిత హాస్యాన్ని జోడించారు దర్శకుడు. తెలుగు ప్రేక్షకులను అలరించేలా సంభాషణలు ఉంటాయి. ఇక విలన్ ఇంటికి హీరో వెళ్లిన తర్వాత ఏం చేస్తాడు? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో మెదులుతుంది. హీరోయిన్‌ను నిజంగా చంపేస్తాడా? అని ఆసక్తిగా చూస్తున్న ప్రేక్షకుడే కాదు, సినిమాలో ఉన్న హీరోకు కూడా ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దీంతో విలన్ మనుషులు హీరో, హీరోయిన్‌లను పట్టుకునేందుకు ప్రయత్నించడం, వారి నుంచి తప్పించుకుని పారిపోయే ఛేజింగ్ సీన్లు నవ్వులు పంచుతూనే అలరిస్తాయి. అయితే, ఇంకాస్త ఉత్కంఠగా వాటిని తీర్చిదిద్దాల్సింది. ప్రీక్లైమాక్స్ ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. కమర్షియల్ హీరోలు ఇలాంటి ట్విస్ట్‌లను ఒప్పుకోరు. ఎందుకంటే విలన్ గ్యాంగ్‌ను కొట్టి, ధీరోదాత్తుడు కావాల్సింది హీరో. అందుకు భిన్నంగా సన్నివేశాలు ఉంటాయి. ఆయా సన్నివేశాలు 'స్వామిరారా' క్లైమాక్స్‌ను గుర్తుచేస్తాయి. ఓవరాల్‌గా విభిన్న చిత్రాలను ఇష్టపడేవారిని 'హీరో' తప్పకుండా అలరిస్తుంది. రక్తపాతం కాస్త ఎక్కువే. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ పాత్రకు ఇందులో పేరు ఉండదు. హీరో.. హీరోయిన్.. విలన్ అంతే..!
ఎవరెలా చేశారంటే?
స్వతహాగా దర్శకుడు అయిన రిషభ్ శెట్టి 'బెల్ బాటమ్'తో కథానాయకుడిగా మారారు. 'హీరో'తో మరో డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నారు. ఇలాంటి చిత్రాలను ఎంచుకోవడం కాస్త సాహసమనే చెప్పాలి. పైగా నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. హీరోయిన్ గన్వి లక్ష్మణ్‌కు తొలి చిత్రమే అయినా, చాలా చక్కగా నటించింది. హావభావాలు పలికించడంతో పాటు, ఛేజింగ్ సన్నివేశాల్లోనూ హీరోతో పాటు కష్టపడింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. డాక్టర్, వంటవాడి పాత్రలు ఎప్పుడు కనపడినా నవ్వులు పంచుతాయి. విలన్ గ్యాంగ్‌లో ఉన్న ఒక పాత్ర హీరోను పట్టుకునే క్రమంలో అడవి పంది కనపడితే అక్కడే హీరోను వదిలేసి మాంసం కోసం దాని వెంట పడటం నవ్వులు పూయిస్తుంది. ఇలా ప్రతి పాత్రకూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది.
సాంకేతికంగా సినిమా బాగుంది. ఒకే ఒక లొకేషన్‌లో సినిమాను మొత్తం పూర్తి చేశారు. అనేక పాత్రలు పెద్దగా గుర్తుండవు. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అజనీశ్ లోకనాథ్ నేపథ్య సంగీతం బాగుంది. ఫైట్, ఛేజింగ్ సీన్లను ఎలివేట్ చేసింది. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎక్కువ స్లోమోషన్ సన్నివేశాలపై దృష్టి పెట్టారు. ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే. ఎం.భరత్‌రాజ్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రథమార్ధంలో ట్విస్ట్‌లను పక్కన పెడితే, కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఛేజింగ్ సీన్ల నిడివి కాస్త పెరిగింది. బహుశా ఒకే లొకేషన్‌లో తీయడం వల్ల చూసిన సన్నివేశమే చూసినట్లు అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ మూవీని చూశామన్న భావన ప్రేక్షకుడుకి కలుగుతుంది.
బలాలు
దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ట్విస్ట్‌లు
నటీనటులు
సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: ఈ 'హీరో' కమర్షియల్ హీరోలకు భిన్నంగా అలరిస్తాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!