సినిమా ప్రారంభిస్తూనే వివాదాల అగ్గి రాజేయడం.. దానిపై వచ్చే విమర్శల్నే ప్రచార అస్త్రాలుగా మార్చుకొని తనదైన శైలిలో సినిమాకు క్రేజ్ తీసుకురావడం రామ్గోపాల్ వర్మ ఎత్తుగడగా మారిపోయింది. 'మర్డర్' చిత్రంతో ఆయన మరోసారి అదే పంథాలో నడిచారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక పరువు హత్య స్ఫూర్తితో.. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో ఆయన ఈసారి ఏం చూపించారు? అందరూ అనుకుంటున్నట్లు మిర్యాలగూడ పరువు హత్యకి.. ఈ కథకీ సంబంధం ఉందా? ఈ సినిమాతోనైనా ఆయన హిట్టు మాట వినిపించారా? లేదా? ఇప్పుడు చూద్దాం.
చిత్రం: రాంగోపాల్ వర్మ 'మర్డర్'
నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
సంగీతం: డి.ఎస్.ఆర్
కూర్పు: శ్రీకాంత్ పట్నాయక్.ఆర్
నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్ చంద్ర
విడుదల: 24-12-2020

కథేంటంటే: ఎంతో కష్టపడి కిందస్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగిన వ్యక్తి మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్). కూతురు నమ్రత (సాహితీ) అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె పుట్టాకే వ్యాపారంలో తనకు బాగా కలిసి వచ్చిందని, అందుకే తన బిడ్డని అదృష్టలక్ష్మిలా భావించి ఎంతో గారాబంగా పెంచుకుంటాడాయన. కూతురు పెళ్లిని కళ్లు చెదిరే రీతిలో అంగరంగ వైభవంగా చేసి.. ఆమెపై తన ప్రేమను, తన స్థాయిని ఊరి వాళ్లకి తెలియజేయాలనే లక్ష్యంతో జీవిస్తుంటాడు. కానీ, అప్పటికే నమ్రత తన కాలేజీలో ప్రవీణ్ అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ విషయాన్ని తండ్రితో చెప్పి, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెడుతుంది. ప్రవీణ్ తన ఆస్తి కోసం.. ఊరిలో తన పరువు, మర్యాదల్ని దెబ్బ తీయడం కోసమే నమ్రతని వలలో వేసుకున్నాడని తెలుసుకున్న మాధవరావు వారి ప్రేమను నిరాకరిస్తాడు.
ఆ అబ్బాయిని మర్చిపొమ్మని శతవిధాల నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే, అప్పటికే ప్రవీణ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన నమ్రత తండ్రికి ఎదురు తిరుగుతుంది. రిజిస్టర్ పెళ్లి చేసుకోని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ప్రేమ మాయ నుంచి తన కూతుర్ని బయటపడేయడం కోసం, సమాజంలో తన పరువు మర్యాదల్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు మాధవరావు. ఊరి నడిమధ్యలో అందరూ చూస్తుండగా అల్లుడిని హత్య చేయించాలని ప్రణాళిక రచిస్తాడు. ఇందుకోసం తన మిత్రడు, లాయర్ నరసింహరావు సహాయంతో ఖయ్యుం (దొరబాబు) అనే కిరాయి హంతకుడ్ని పురమాయిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది. మాధవరావు తాను అనుకున్నట్లుగా ప్రవీణ్‌ని హత్య చేయిస్తాడా? నమ్రతని తిరిగి తన దగ్గరకి రప్పించుకోగలుగుతాడా? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: కథ.. నటీనటుల పేర్లు.. వారి వేషధారణ చూడగానే ఇది మిర్యాలగూడ పరువు హత్యకు సంబంధించిన కథే అని అనిపిస్తుంది. 'కానీ, యాదృచ్ఛికంగా అందరికీ అలా అనిపిస్తే అది తమ తప్పు కాదని, ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన చిత్రం కాద'ని ఇప్పటికే స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. పరువు హత్యల కోణంలో ఇప్పటి వరకు చాలా కథలు వచ్చాయి. కానీ, మర్డర్ చిత్రంతో ఓ తండ్రి కోణంలో పరువు హత్యకు దారితీసిన పరిస్థితుల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. బలమైన భావోద్వేగాలతో నిండిన కథ ఇది. తొలి భాగంలో ప్రేమ విషయంలో త్రండ్రీ కూతుర్ల మధ్య నడిచే పోరును, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తమని కాదని వెళ్లిపోతే తల్లిదండ్రుల పడే వేదనను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ద్వితీయార్ధంలో కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తండ్రి హంతకుడిగా ఎలా మారాడన్నది భావోద్వేగభరితంగా చూపించారు. ప్రథమార్ధంలో ప్రేమ విషయమై తండ్రీ, కూతుర్ల మధ్య జరిగే సంభాషణల్ని ఎంతో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, కథలో సన్నివేశాలన్నీ పూర్తిగా మాధవరావు పాత్రకు అనువుగా సాగడం.. అక్కడక్కడా కథలో బిగి సడలినట్లు అనిపిస్తుంటుంది. ఇక ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథ ఎక్కువగా మాధవరావు పాత్ర చుట్టూనే తిరుగుతుండటం, చాలా చోట్ల సన్నివేశాలు మరీ నత్తనడకన నడిచినట్లు అనిపించడం.. ఏదో సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రవీణ్ హత్యకు మాధవరావు ప్రణాళిక రచించినప్పటి నుంచీ వచ్చే సన్నివేశాలన్నీ ఉద్వేగభరితంగా, ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. సినిమాకి ప్రధాన ఆయువు పట్టు ఈ ఎపిసోడే. ముఖ్యంగా ప్రవీణ్ హత్య సమయంలో వచ్చే నేపథ్య సంగీతం ఒళ్లు జలదరించేలా చేస్తుంది. ముగింపులో ఈ బిగి మళ్లీ సడలినట్లు అనిపిస్తుంది. కానీ, ఇది ఓ యథార్థ సంఘటన స్ఫూర్తితో అల్లుకున్న కథ కాబట్టి ఆ ముగింపును ప్రేక్షకులు ఒప్పుకోక తప్పదు.

ఎవరెలా చేశారంటే: మాధవరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటన, ఆయన వేషధారణ మెప్పిస్తుంది. కూతుర్ని ప్రేమించిన వాడు చెడ్డవాడని తెలిసీ, ఆ విషయాన్ని ఆమెకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయే తండ్రిగా ఆయన నటన కట్టిపడేస్తుంది. అలాగే ద్వితీయార్ధంలో ఆయనలోని ప్రతినాయక ఛాయలన్నీ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ప్రవీణ్ ప్రేమలో పడి, తల్లిదండ్రులకు ఎదురు తిరిగే కూతురు నమ్రత పాత్రలో సాహితి ఒదిగిపోయింది. తెరకు కొత్తగా పరిచయమైన అమ్మాయిలా ఉన్నా.. చాలా సన్నివేశాల్లో శ్రీకాంత్‌తో పోటాపోటీగా మెప్పిస్తుంది. గాయత్రి భార్గవి తన పాత్రకు ఉన్న పరిధిలో భావోద్వేగభరితంగా నటించింది. ప్రవీణ్ పాత్ర పోషించిన నటుడికి రెండు మూడు సన్నివేశాల్లో కనిపించడం మినహా ఎక్కడా నటించే అవకాశమే రాలేదు.

వర్మను పాలో అయినట్లుగా..
ఇక టేకింగ్ స్టైల్‌లో దర్శకుడు ఆనంద్ చంద్ర.. వర్మను యథావిథిగా ఫాలో అయిపోయాడనిపిస్తుంది. కథ మొత్తం ఒక దగ్గరే.. రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుండటం.. బోర్‌గా అనిపిస్తుంటుంది. ఇది తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమే అయినా.. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయికీ తన ఛాయాగ్రహణంతో నూటికి నూరు శాతం నాయ్యం చేసే ప్రయత్నం చేశారు జగదీష్ చీకటి. ఆయన ఛాయాగ్రహణం, డీఎస్‌ఆర్ సంగీతం సినిమాకు కావాల్సినంత బలాన్ని చేకూర్చాయి. నిడివి పరంగా చూసుకున్నప్పుడు ఇది థియేటర్లు లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రం కాదనిపిస్తుంది.
బలాలు
- శ్రీకాంత్, సాహితీ నటన..
- ఎంచుకున్న కథాంశం
- వర్మ బ్రాండ్ ఇమేజ్
బలహీనతలు
- రెండు పాత్రల చుట్టూనే కథ తిరగడం
- ముగింపు
చివరిగా: -ఓ తండ్రి ఆలోచనలకు అనుగుణంగా సాగే 'మర్డర్'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఇదీ చూడండి:సమీక్ష: 'బెల్ బాటమ్' తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?