చిత్రం: జల్లికట్టు
నటీనటులు: ఆంటోనీ వర్ఘీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ పిళ్లై
నిర్మాత: ఒ.థామస్ పణిక్కర్
దర్శకత్వం: లీజో జోస్ పెల్లిస్సరీ
విడుదల: ఆహా ఓటీటీ
కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని చిత్రాలూ రానున్నాయి. మరోవైపు ఇతర భాషల్లో విడుదలైన విజయవంతమైన చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా విడుదలైన చిత్రాల్లో 'జల్లికట్టు' ఒకటి. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం 'ఆహా' ఓటీటీలో విడుదలైంది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకులను సైతం మెప్పించిన 'జల్లికట్టు' ఎలా ఉంది? 'అంగామలై డైరీస్' చిత్రాన్ని తీసి అందరి ప్రశంసలు అందుకున్న జోస్ పెల్లిస్సరీ.. ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు?
కథేంటంటే:
అనంతపురం జిల్లా భైరవకొండ ప్రాంతంలో విన్సెంట్ ( చెంబన్ వినోద్), తన సహాయకుడు ఆంటోని(ఆంటోని వర్ఘీస్)తో కలిసి బీఫ్ అమ్ముతుంటాడు. ఆ ప్రాంతంలో విన్సెంట్ అమ్మే బీఫ్‌కు ఎంతో పేరుంది. ఎప్పటిలాగే ఒకరోజు తెల్లవారుజామున ఓ అడవి దున్నను నరకడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అది తప్పించుకుని ఊరి మీద పడుతుంది. ఎదురుపడిన వాళ్లను కుమ్ముకుంటూ, అడ్డు వచ్చిన వాటిని తొక్కుతుంటూ వెళ్తుంది. దీంతో ఊళ్లోని వారందరూ ఆ అడవి దున్నను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తుపాకీ వాడకంలో చేయి తిరిగిన కుట్టచన్ (సబూమన్)ను పిలిపిస్తారు. దీంతో గుంపులుగా విడిపోయి అందరూ ఆ దున్నను బంధించడానికి సిద్ధమవుతారు. మరి ఊరి వాళ్లంతా కలిసి ఆ అడవి దున్నను బంధించారా? లేక హతమార్చారా? ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ఆపద ఎదురైంది? తెలియాలంటే 'జల్లికట్టు' చూడాల్సిందే!
ఎలా ఉందంటే:
కథగా తీసుకుంటే చాలా చిన్న లైన్. కానీ, దర్శకుడు పెల్లిస్సరీ దీన్నొక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే అసలు కథేంటో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. అయితే, తప్పించుకున్న దున్నపోతును ఎలా పట్టుకుంటారన్న ఉత్కంఠే సినిమాను ముందుకు నడిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు నూటికి నూరుపాళ్లు సఫలమయ్యారు. చావు నుంచి తప్పించుకున్న అడవి జంతువు ప్రాణ భయంతో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తోందో నిజ జీవితంలోనూ మనం చాలా సంఘటనలు చూశాం. అవన్నీ వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. విన్సెంట్ బృందం ఒకవైపు, కుట్టచన్ బృందం మరోవైపు, ఆ ఊళ్లోని యువకులందరూ ఇంకొక బృందంగా విడిపోయి ఆ దున్నపోతును పట్టుకునే ప్రయత్నం ఆసాంతం ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఆ దున్నపోతును పట్టుకోవడం ద్వారా తమను తాము హీరోలుగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు ప్రవర్తించే తీరు, మనిషికి మృగానికీ తేడాలేదనిపిస్తుంది. నిజంగా ఓ దున్నపోతు కోసం మనుషుల ప్రవర్తన ఈ రకంగా మారుతుందా? అంటే చెప్పలేం. నేటి ఆధునిక మానవుడిలోనూ ఆదిమమానవుడు బతికే ఉన్నాడన్న దాన్ని చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆ రోజుల్లో వేట విషయంలో మనుషుల మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉండేదనేది చరిత్ర పుస్తకాల్లో మనం చదివాం. అదే నేటికీ మనుషుల్లో జీవించి ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇతరుల మెప్పు పొందడానికి ఆ దున్నపోతును తాము పట్టుకున్నట్లు చెప్పుకొనేందుకు ఆంటోని, కుట్టచన్ తీసుకునే నిర్ణయాలు ఆ ఊరివాళ్ల జీవితాలపై ప్రభావం చూపుతాయి. అయితే, మధ్యలో వచ్చే కథకు దూరంగా మధ్యలో వచ్చే సన్నివేశాలు నవ్వు పంచినా, సీరియస్‌గా సాగే కథనంలో కాస్త ఇబ్బంది అనిపిస్తాయి. చివరిలో అందరూ కలిసి ఆ దున్నపోతును పట్టుకున్నా, ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చారు దర్శకుడు. అదేంటో తెలియాలంటే తెరపై చూడాలి.
ఎవరెలా చేశారంటే:
ఆంటోనీ, విన్సెంట్, కుట్టచన్‌లుగా కనిపించే ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమన్ అబ్దుసమద్‌లు తెరపై వారి పాత్రల్లో ఒదిగిపోయారు. పలమనేరు కుర్రాళ్లం అంటూ ఒక యువకుల గుంపు చేసే హడావిడి సరదాగా ఉంటుంది. ఇక ఈ సినిమా గురించి ప్రధానంగా చెప్పకోవాల్సింది సాంకేతిక వర్గం పనితీరు. మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం. ఈ రెండూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి సన్నివేశం, దానికి అనుగుణంగా వచ్చే సంగీతం ప్రేక్షకుడిలో ఉత్కంఠను కలిగిస్తుంది. డిఫరెంట్ టేకింగ్, సంగీతంతో సినిమా మొదలవుతుంది. ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలంటే ఎంతో ఓపిక అవసరం. గిరీష్ గంగాధరన్ ఎంత ఓపికతో పనిచేశారో తెరపై మనకు కనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక రోజులో జరిగే కథ కావడం వల్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా రాత్రివేళ దున్నపోతు కోసం సాగించే వేటను తీర్చిదిద్దిన విధానం, బావిలో పడిన దాన్ని పైకి తీసే సమయంలో లైటింగ్ ఎఫెక్ట్‌లు, ఊరి యువకులంతా మూడు బృందాలుగా విడిపోయే సన్నివేశం హైలైట్ అని చెప్పొచ్చు.
ప్రశాంత్ పిళ్లై అందించిన సంగీతం సినిమాకు బలం. శ్వాస తీసుకోవడం, గడియారం చప్పుడు, ఇలా చిన్న చిన్న శబ్దాలు కూడా మనల్ని కథలో నిమగ్నమయ్యేలా చేస్తాయి. దీపూ జోసెఫ్ ఎడిటింగ్ బాగుంది. కథకు ఏ సరకు అవసరమో దాన్ని మాత్రమే తీసుకున్నారు. అంగామలై డైరీస్ (తెలుగులో విశ్వక్‌సేన్ నటించిన 'ఫలక్‌నుమా దాస్') తెరకెక్కించిన జోస్ పెల్లిస్సరీ నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఒక విభిన్న కథను ఎంచుకున్నారు దర్శకుడు. ప్రతి ఫ్రేమ్‌ను ఉత్కంఠగా తీర్చిదిద్దారు. అయితే, కథ మధ్యలో వచ్చే ఉప కథలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఉత్కంఠతో సాగే కథకు కాస్త స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి. 'జల్లికట్టు' ఆట తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పేరునే తన సినిమాకు పెట్టుకున్నారు దర్శకుడు. అయితే, టైటిల్‌కు కథకు పెద్దగా సంబంధం ఉండదు. ఈ సినిమా ద్వారా తానేమీ సందేశాన్ని ఇవ్వటం లేదని ఒక సందర్భంలో పెల్లిస్సరీ చెప్పుకొచ్చారు. కానీ, నేటి ఆధునిక మనిషిలోనూ ఆదిమమానవుడి ప్రవర్తన దాగి ఉంటుందని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది బయటపడుతుందని 'జల్లికట్టు'లో చూపించారు.
బలాలు
- కథనం
- దర్శకత్వం
- నేపథ్య సంగీతం
- సినిమాటోగ్రఫీ
బలహీనతలు
- తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం
- ఉపకథలు
చివరిగా: ఉత్కంఠతో సాగే ప్రయోగాత్మక చిత్రం 'జల్లికట్టు'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">