తన శైలి సినిమాలే చేయడం కాదు.. దర్శకుల మార్క్ చిత్రాల్లోనూ తాను ఒదిగిపోవాలనేది మెగాహీరో వరుణ్ తేజ్ ఆలోచన. అందుకే ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథలో నటిస్తుంటాడు. ఈసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో 'గద్దలకొండ గణేష్'గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో విజయవంతమైన `జిగర్తాండ`కు రీమేక్ ఇది. `గబ్బర్‌సింగ్` తర్వాత హరీశ్ శంకర్ చేసిన మరో రీమేక్ చిత్రమిది.
'వాల్మీకి' టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సరిగ్గా విడుదలకు ముందు రోజు 'గద్దలకొండ గణేష్'గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది చిత్రబృందం. ప్రతినాయక పాత్రలో వరుణ్‌తేజ్ నటించడం. ఆయన గెటప్పు, హావభావాలు కొత్తగా ఉండటం.. ఇప్పటికే ఆకట్టుకున్న ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మరి అందుకు తగ్గట్టుగా చిత్రం ఉందో లేదో తెలుసుకుందాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథ:
దర్శకుడు కావాలనేది అభిలాష్ (అధర్వ) ఆశయం. అందుకోసం చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటాడు. ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటాడు. అతడి తపనని చూసి దర్శకుడిగా అవకాశం ఇస్తాడు ఓ నిర్మాత. నా సినిమాలో విలనే హీరో కావాలని చెప్పుకునే అభిలాష్ తన తొలి చిత్రం కోసం ఓ గ్యాంగ్‌స్టర్ కథను రాయాలని అనుకుంటాడు. అందుకోసం గద్దలకొండ గణేష్ అలియాస్ గని (వరుణ్‌తేజ్)ని టార్గెట్‌గా చేసుకుంటాడు. అతని జీవితం గురించి తెలుసుకునేందుకు గద్దలకొండకు వెళతాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడైన చింతపండు కొండమల్లి (సత్య)తో కలిసి గ్యాంగ్‌స్టర్ గణేష్ జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు. ఈ క్రమంలో గణేష్ గురించి అభికి ఎలాంటి విషయాలు తెలిశాయి? అతడి గురించి రాసుకున్న కథలో హీరో ఎవరు? ఆ సినిమా విడుదలయ్యాక గణేష్ జీవితం ఎలా మారింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సొంతంగా కథ రాసుకుని సినిమా తీయడంలో ఎన్ని సవాళ్లుంటాయో.. రీమేక్ కథని తెరకెక్కించడంలోనూ అన్నే సవాళ్లుంటాయి. ఇప్పటికే 'గబ్బర్‌సింగ్'తో ఈ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు హరీశ్ శంకర్. ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు.. వరుణ్‌తేజ్‌కి తగ్గట్టుగా పాత్రను తీర్చిదిద్ది యథాతథంగా `జిగర్తాండ` కథను చెప్పాడు. ఆ ప్రయత్నం సినిమాకు కలిసొచ్చింది. గద్దలకొండ గణేష్‌గా వరుణ్‌తేజ్ విజృంభణ ఒకవైపు... వాణిజ్యాంశాలతో కూడిన కథ, కథనాలు మరోవైపు ఉంటం వల్ల ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది సినిమా.
ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. గద్దలకొండ గణేష్ చేసే దందాలు, శత్రువులు వేసే ఎత్తులకు పైఎత్తులు, ఆయన జీవితం గురించి కొండమల్లితో కలిసి అభి తెలుసుకొనే ప్రయత్నంతో ప్రథమార్థం సాగుతుంది. సన్నివేశాల్లో భాగంగానే హాస్యం ఉండటం వల్ల సినిమా సరదాగా సాగుతుంది. విరామం సమయంలో వచ్చే మలుపు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. కథ, కథనాలతో పాటు... సందర్భోచిత హాస్యం, భావోద్వేగాలకు చోటిచ్చారు. గద్దలకొండ గణేష్ కథలో కథానాయకుడు ఎవరనేది ఖరారయ్యే సందర్భం, సినిమాకోసం శిక్షణ తీసుకొనే ప్రక్రియ.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. గణేష్, శ్రీదేవి (పూజాహెగ్డే)ల ఫ్లాష్‌బ్యాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వాళ్లిద్దరి ప్రేమకథతో పాటు... 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాట ప్రేక్షకుల్ని అలరిస్తుంది. పతాక సన్నివేశాలూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నితిన్, సుకుమార్ అతిథి పాత్రల్లో మెరుస్తారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటీనటులు... సాంకేతికత:
వరుణ్‌తేజ్ నటన సినిమాకు ప్రధానబలం. గద్దలకొండ గణేష్‌గా ఒదిగిపోయాడు. ప్రత్యేకమైన ఆ గెటప్పు, హావభావాలు చాలా బాగా కుదిరాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో చిరంజీవిని గుర్తు చేశాడు. తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పిన విధానం మెప్పిస్తుంది. పూజాహెగ్డే కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా... ఆమె తన అందంతో ఆకట్టుకుంటుంది. 'ఎల్లువొచ్చి గోదారమ్మ...' రీమిక్స్ పాటలో వరుణ్, పూజా చేసిన సందడి ఆకట్టుకుంటుంది. అధర్వ, మృణాళిని రవి పాత్రలు బాగున్నాయి. దర్శకుడిగా ఎదగాలనే తపన ఉన్న యువకుడి పాత్రలో అధర్వ మెప్పిస్తాడు. సత్య, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, అన్నపూర్ణమ్మ, రచ్చరవి, శత్రు తదితరుల పాత్రలు పరిధిమేరకు ఆకట్టుకుంటాయి.
డింపుల్ హయాతి చేసిన ప్రత్యేకగీతం, ఆమె అందం సూపర్‌హిట్టు అనిపించేలా ఉంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఛాయాగ్రాహకుడు అయాంక బోస్ గ్యాంగ్‌స్టర్ సినిమాకు తగ్గట్టుగా ప్రత్యేకమైన కలరింగ్, మూడ్‌తో తన కెమెరా పనితనాన్ని ప్రదర్శించాడు. మిక్కీ జె.మేయర్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ పరంగా మాత్రం చాలా చోట్ల కత్తెరకి పనిచెప్పాల్సింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడిగా హరీశ్ శంకర్ పనితీరు మెప్పిస్తుంది. రచనలో అతడికున్న బలం మరోసారి ఈ సినిమాతో రుజువైంది. "ఇదివరకు సుఖంగా బతకాలనుకునేవాళ్లు.. ఇప్పుడు సుఖంగా చస్తే చాలనుకుంటున్నారు", "మన చేతుల్లో ఉత్త గీతలే ఉంటయి.. రాతలు ఉండయి"లాంటి సంభాషణలు చప్పట్లు కొట్టిస్తాయి. మాస్ ప్రేక్షకులకు తగ్గట్టుగా హరీశ్ శంకర్ తన మార్క్ మార్పులు చేయడం సినిమాకు కలిసొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చివరిగా...
అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు మినహా... సమతూకమైన కథ, పాత్రలతో ఆద్యంతం వినోదం పంచే సినిమా 'గద్దలకొండ గణేష్'. మాస్ ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సినిమా గొప్పతనం గురించి చెప్పిన విషయాలు అలరిస్తాయి. ఓ కొత్త నేపథ్యంలో సాగే సరికొత్త గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది.
గమనిక: ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఇవీ చూడండి.. కొరియన్ రీమేక్‌లో కాజల్ అగర్వాల్..!