చిత్రం: ఏక్ మినీ కథ
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధదాస్, సప్తగిరి, బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని కృష్ణమురళి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్: జి.సత్య
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
రచన, స్క్రీన్‌ప్లే: మేర్లపాక గాంధీ
దర్శకత్వం: కార్తీక్ రాపోలు
విడుదల: అమెజాన్ ప్రైమ్
కరోనా సెకండ్‌వేవ్‌తో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే పలు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అలా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించాల్సిన చిత్రం 'ఏక్ మినీ కథ'. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. మరి 'ఏక్ మినీ కథ' ఏంటి? కథ చిన్నదా? పెద్దదా? వంటి విషయాలు సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
సంతోష్ శోభన్(సంతోష్)కు చిన్నప్పటి నుంచి ఒక అనుమానం మదిని తొలి చేస్తుంటుంది. తన జననాంగం చిన్నదని అతడి భావన. దీంతో మెరిట్ స్టూడెంట్ అయిన సంతోష్ సరిగా చదవలేక ఆ ఆలోచనలతో చదువులో వెనుకబడిపోతాడు. ఎలాగో ఇంజినీరింగ్ పూర్తి చేసి, కనస్ట్రక్షన్ కంపెనీలో చేరతాడు. అయినా కూడా అతను అదే ఆలోచనలతో సతమతమవుతూ తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తుంటాడు. ఒకానొక సమయంలో ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కొడుకు వింత ప్రవర్తనతో విసిగిపోయిన రామ్మోహన్(బ్రహ్మాజీ) అతడికి పెళ్లి సంబంధం చూస్తాడు. దీంతో సంతోష్, అమృత(కావ్య)లకు వివాహం అవుతుంది. పెళ్లి తర్వాత తన సమస్య బయటపడకూదన్న సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
"నాన్నా పిల్లలు ఎలా పుడతారు" అని చిన్నప్పుడు అడిగితే "వేలెడంత లేవు. నీకెందుకురా ఆ ప్రశ్నలు" అని చాలా మంది తల్లిదండ్రులు తిడతారు. ఇలా పిల్లలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తిట్టో.. కొట్టో.. వారిని భయపెడుతుంటారు. దీంతో వారు ఎదుగుతున్న సమయంలో వచ్చే అనుమానాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి వారిలోనే వారు మథనపడిపోతుంటారు. ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు. యుక్త వయసు వచ్చిన వారిలో చాలా మందికి వచ్చే ఒక ప్రశ్ననే పాయింట్‌గా తీసుకుని, కథను సిద్ధం చేశారు యువ దర్శకుడు మేర్లపాక గాంధీ. దానికి హాస్యం జోడిస్తూ దర్శకుడు కార్తీక్ రాపోలు 'ఏక్ మినీ కథ'ను చక్కగా తీర్చిదిద్దాడు. మొదటి పది నిమిషాల్లోనే కథానాయకుడిగా ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక సంతోష్ పడే వేదన.. అభద్రతా భావం దాన్ని అధిగమించేందుకు పాటించే చిట్కాలు, సర్జరీ కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లడం ఇలా వరుస సన్నివేశాలతో కథ సాగిపోతుంటుంది. సంతోష్ పడే ఇబ్బంది నుంచి హాస్యం పుట్టేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. దీంతో ప్రథమార్ధమంతా నవ్వులతో సాగిపోతుంది. ముఖ్యంగా సంతోష్, అతడి స్నేహితుడు సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. అమృతతో అనుకోకుండా పెళ్లి జరగడం వల్ల కథ మలుపు తిరుగుతుంది.
పెళ్లి తర్వాత కథానాయకుడికి కొత్త సమస్య వచ్చి పడుతుంది. శోభనాన్ని తప్పించుకునేందుకు అతడు చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి. సంతోష్ ఇంట్లో సప్తగిరి అండ్ కో చేసే హంగామా కాస్త అతిగా అనిపిస్తుంది. ఇక్కడే పలు సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. అయితే, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న వాటిని ఎంచుకుని నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సోనూసూద్, రాకేశ్ మాస్టర్, పూజాహెగ్డే కాళ్లు, ప్రేమికులకు పార్కుల్లో పెళ్లి చేయడం ఇలా ఒక్కో సన్నివేశంలో ఒక్కో విషయాన్ని ప్రస్తావించాడు. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు. చివరిలో నాయక-నాయికల మధ్య వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే ఉన్నా అంతకుమించి ముగింపు ఆశించలేం. పిల్లలకు వచ్చే అనుమానాలను ప్రేమతో నివృత్తి చేయాలి తప్ప వాళ్లని భయపెట్టకూడదని సైకియాట్రిస్ట్ హర్షవర్ధన్ ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే?
యువ కథానాయకుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఆత్మన్యూనత కలిగిన యువకుడిగా సంతోష్ నటన మెప్పిస్తుంది. సినిమాలో ఎవరు.. ఏ విషయం గురించి మాట్లాడినా, తన సమస్యే గురించి చెబుతున్నారన్న భావనతో మథనపడే యువకుడి పాత్రలో చక్కగా సరిపోయారు. ఇలాంటి కథ, పాత్రలు, బాలీవుడ్‌లో వస్తుంటాయి. 'విక్కీ డోనర్', 'బాలా' వంటివి ఇలాంటి కథలతో వచ్చినవే. ఈ తరహా కథలు ఎంచుకోవడానికి పెద్ద హీరోలెవరూ ముందుకురారు. కానీ, యువ కథానాయకుడు సంతోష్ ధైర్యంగా చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ అతని హావభావాలతో మెప్పించాడు. బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని, సప్తగిరి నవ్వులు పంచారు. శ్రద్ధాదాస్ స్వామిజీగా ద్వితీయార్ధంలో కనిపిస్తుంది. తన పాత్ర పరిధి మేరకు నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సాంకేతికంగా సినిమా ఓకే. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. రచయిత మేర్లపాక గాంధీ ఎంచుకున్న పాయింట్ చాలా సున్నితమైంది. సాధారణంగా చర్చించడానికి కూడా కాస్త ఇబ్బంది పడే ఈ పాయింట్‌ను తీసుకుని రెండు గంటలు నడపటం మామూలు విషయం కాదు. దాన్ని అంతే సున్నితంగా దర్శకుడు కార్తీక్ తీర్చిదిద్దాడు. కథ అంతా కథానాయకుడి సమస్య చుట్టూనే సాగుతున్నా, అసభ్యతకు తావులేకుండా హాస్యం పాళ్లు ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. ద్వితీయార్ధంలో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. పాటలు కథాగమానికి కాస్త బ్రేకులు వేస్తాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీర్చిదిద్దారు. కుటుంబంతో కలిసి చూడటం కాస్త ఇబ్బందికరమే. ఎలాగూ ఓటీటీలో విడుదలైంది కాబట్టి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని యువత చక్కగా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. తప్పకుండా నవ్వులు పంచుతుంది.
బలాలు
హాస్యం
నటీనటులు
ప్రథమార్ధం
బలహీనతలు
ద్వితీయార్ధంలో నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: 'ఏక్ మినీ కథ'.. తాను బాధపడుతూ మనల్ని కడుపుబ్బా నవ్వించే యువకుడి కథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!