కన్నడ హీరో రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నటించిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ'. సచిన్ దర్శకత్వం వహించాడు. శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ఐదు భాషల్లో విడుదలవుతుంది. 2019 డిసెంబర్ 27న కన్నడలో ప్రేక్షకుల ముందుకు రాగా... నూతన సంవత్సరం కానుకగా నేడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
మరి ఇందులో పాన్ ఇండియా కంటెంట్ ఉందా? ఏడుగురు సహాయ దర్శకులు పనిచేసిన ఈ చిత్రం ఎలా ఉంది.? హీరోగా నటించిన రక్షిత్ శెట్టి.. రచయితగానూ పనిచేశాడు. మరి అతడు రాసిన కథేంటీ? 2020లో మొదటిగా విడుదలైన సినిమా బోణీ కొట్టిందా లేదా తెలియాలంటే ఈటీవీ భారత్ మూవీ సమీక్షలోకి వెళ్దాం.
ఇదీ సినిమా లైన్...
కల్పిత నగరం 'అమరావతి'పై ఆధిపత్యం సాగిస్తోన్న అభీరుల వంశం నుంచి భారీ నిధి చోరీకి గురవుతుంది. ఆ నిధిని తిరిగి సాధించి... దొంగిలించిన వారి వంశాన్ని అంతం చేసేవరకు అభీరుల రాజ్యాన్ని పాలించనని తండ్రికి మాటిస్తాడు ఆ రాజ్యానికి చెందిన జయరాముడు(బాలాజీ మనోహర్). నిధి వేటలో అన్వేషణ సాగిస్తుండగా.. శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) అనే పోలీసు అధికారి అమరావతికి వస్తాడు. హీరో అభీరుల రాజ్యం నుంచి నిధిని దొంగిలించింది అమరావతిలో ఉంటున్న రంగస్థల కళాకారులని తెలుసుకుంటాడు. దొంగిలించిన నిధిని రంగస్థల కళాకారులు ఎక్కడ దాచారు? దాన్ని శ్రీమన్నారాయణ ఎలా కనిపెట్టాడు? జయరాముడి నుంచి ప్రాణహాని ఉన్న రంగస్థల కళాకారులను శ్రీమన్నారాయణ ఎలా రక్షించాడు.? లక్ష్మి(శాన్వి)తో హీరోకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
ఇదొక కల్పిత కథ. కాలంతోనూ, ప్రదేశాలతోనూ సంబంధం లేకుండా ఊహించి రాశారు. ఇలాంటి జోనర్ సినిమాలు రావడం చాలా అరుదనే చెప్పాలి. కౌబాయ్ సినిమాలకు దగ్గరగా అనిపించినా... అందుకు భిన్నమైన నేపథ్యం ఇందులో ఉంది. బందిపోటు వారుసులైన ఇద్దరు ముఠా నాయకులకి మధ్య ఓ గమ్మత్తైన పాత్ర ప్రవేశించి చేసే హంగామా ఎలా ఉంటుంది, దానికి బలమైన కథ, కథనాలు తోడైతే ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో ఈ సినిమాలో చూడొచ్చు.
నిధి, కోటపై ఆధిపత్యం చుట్టూనే కథ నడిపినా... అంతర్లీనంగా కథలో పలు కోణాలు కనిపిస్తాయి. నిధిని కనిపెట్టేందుకు దొరికిన చిన్న క్లూ, దాని ఆధారంగా అన్వేషణ సాగించే విధానం, పురాణాలతో ముడిపెడుతూ సాగే క్రమంలో కథానాయకుడి తెలివి తేటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే బాహుబలిలో కాలకేయులు, కేజీఎఫ్‌లో గని కార్మికుల తరహాలోనే ప్రత్యేకంగా అభీరుల రాజ్యాన్ని సృష్టించడం, అందులో ఉన్న వ్యక్తులు, వారి వస్త్రధారణ కొత్తగా అనిపిస్తుంది. అయితే కథనంతో ప్రేక్షకులను కట్టిపడేసినా... సినిమా రెండోభాగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశాలు, క్రైమాక్స్ ఆకర్షణగా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాకు కావల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న శ్రీమన్నారాయణలో నిడివి ఈ చిత్రానికి మైనస్ పాయింట్.
ఎవరెలా చేశారంటే...
ఈ సినిమా గురించి కథగా కంటే వ్యక్తుల గురించి ఎక్కువగా చెప్పాలి. నారాయణ అనే పోలీసు అధికారిగా హీరో రక్షిత్ శెట్టి పండించిన హాస్యం, చేసే విన్యాసాలు, హావభావాలు ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తంలో ఒక పాటలో మినహా మొత్తం ఒకే డ్రెస్ తో రక్షిత్ కనిపించడం ఈ చిత్రంలో ప్రత్యేకత. ఈ హీరోలో మంచి రచయిత ఉన్నాడని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది.
కథ రాయడం దగ్గరి నుంచి శ్రీమన్నారాయణ పాత్ర ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని జీర్ణించుకున్న రక్షిత్ శెట్టి... వన్ మ్యాన్ షోగా శ్రీమన్నారాయణను అద్భుతంగా నడిపించాడు.
ప్రతినాయకులుగా నటించిన బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి చక్కటి నటన ప్రదర్శించారు. కథానాయిక శాన్వీ పాత్ర పరిధి తక్కువే అయినా కథలో కీలకంగా నిలుస్తుంది. కర్ణాటకలో ఉన్న ప్రముఖ రంగస్థల కళాకారులు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఫాంటసీ కథకు తగినట్లుగా విజువల్స్ కుదిరాయి. దర్శకుడు సచిన్ పనితీరు అబ్బురపరుస్తుంది. అంజనీశ్ లోకనాథ్, చరణ్ రాజ్ సంయుక్తంగా అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం.
" ఒక నాయకుడి ప్రస్థానంలో రెండు యుద్ధాలు. రణరంగంలో ఒకటి, అంతరంగంలో ఒకటి", "దారి తప్పిన వాళ్లను క్షమించొచ్చు.. తప్పుడు దారి పట్టినవాళ్లను కాదు" అని సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బలం:
+ రక్షిత్ శెట్టి, సినిమా తెరకెక్కించిన విధానం, సంగీతం
బలహీనత:
- నిడివి, బలమైన ప్రతినాయకులు లేకపోవడం
చివరగా:
కొత్తదనాన్ని పంచే శ్రీమన్నారాయణ