చిత్రం: అనుభవించు రాజా; నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, నరేన్, అజయ్, అరియానా తదితరులు; సంగీతం: గోపీ సుందర్; నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి; సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి; విడుదల: 26 నవంబర్
హుషారైన పాత్రలకు పెట్టింది పేరు రాజ్ తరుణ్. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తెరపై సందడి చేస్తుంటాడు. ఆరంభంలో మంచి విజయాలే అందుకున్నా.. అతడి సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించడం లేదు. తన శైలి పాత్రలో మరోసారి కనిపిస్తూ 'అనుభవించు రాజా' చేశాడు. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వస్తుండటం వల్ల సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: బంగారం అలియాస్ రాజు (రాజ్‌తరుణ్) పెద్దింట్లో పుట్టి పెరిగిన కుర్రాడు. తన తాత చివరి వరకూ సంపాదనకే పరిమితమై తనకంటూ జ్ఞాపకాలేమీ లేకుండా తనువు చాలిస్తాడు. తన చివరి క్షణాల్లో నువ్వైనా బాగా అనుభవించు అని మనవడికి చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు. అప్పట్నుంచి బంగారం జల్సారాయుడిగా మారతాడు. అనుభవించడానికే పుట్టానన్నట్టుగా కోడిపందేలు, సరదాలతో కాలం వెల్లబుచ్చుతుంటాడు. ఊరికి ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. ఎన్నికల హడావుడిలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఊళ్లో జల్సాగా బతికిన బంగారం సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఎందుకయ్యాడు? శ్రుతి (కశిష్‌ఖాన్)తో అతడి ప్రేమాయణం ఎలా సాగిందన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే: పల్లెటూరు.. అక్కడి కొన్ని కుటుంబాలతో ముడిపడిన కథ ఇది. కామెడీ, డ్రామాకు అవకాశం ఉన్న కథనే రాసుకున్నారు దర్శకుడు. ప్రథమార్ధం హైదరాబాద్, ద్వితీయార్ధం పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. సెక్యూరిటీ గార్డ్‌గా కథానాయకుడు ఉద్యోగంలో చేరడం, అక్కడ కథానాయికతో పరిచయం కావడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలతో సినిమాని సరదాగా నడిపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ సన్నివేశాల్లో అంత బలం లేకపోవడం వల్ల పెద్దగా వినోదం పండలేదు. విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపుకు కారణమవుతాయి. కథానాయకుడిలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. కథ పల్లెటూరికి వెళ్లాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా నిరాశే. చూసేసిన కోడి పందేలు, ఒకే రకమైన సందడి. కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ కుటుంబంలోని డ్రామా, హత్య వెనక ఎవరున్నారనే విషయంపై రేకెత్తించిన ఆసక్తి ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలు, హుషారుగా సాగే పాటలే చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
ఎవరెలా చేశారంటే: రాజ్‌తరుణ్ బంగారం పాత్రలో ఓ జల్సారాయుడిలా చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధంలో సెక్యూరిటీ గార్డ్ రాజుగా, సుదర్శన్‌తోనూ, కథానాయిక కశిష్‌ఖాన్‌తో కలిసి చేసిన సన్నివేశాలు కూడా సరదాగా అనిపిస్తాయి. అజయ్ పాత్ర, ఆయన నటన ఆకట్టుకుంటుంది. కథానాయిక కశిష్‌ఖాన్ అందంగా కనిపించింది. సాంకేతికంగా చూస్తే సినిమా పర్వాలేదనిపిస్తుంది. పాటలు, చిత్రీకరణ మెప్పిస్తుంది. దర్శకుడు శ్రీను గవిరెడ్డి రాసుకున్న కథలో బలం ఉంది కానీ, కథనం అంతగా మెప్పించలేదు. కామెడీ బలంగా పండకపోవడం కూడా సినిమాకి మైనస్‌గా మారింది. అంతర్లీనంగా ఊరి గురించి, అనుభవించడం గురించి, కుటుంబ బంధాల గురించి చెప్పిన సందేశం ఆకట్టుకుంటుంది. మాటలు కూడా బాగున్నాయి.
బలాలు
+ కొన్ని సరదా సన్నివేశాలు
+ కథ, పాటలు
+ క్లైమాక్స్
బలహీనతలు
-కథనం
-కామెడీ తగ్గడం
చివరిగా: ఈ బంగారంగాడిలో మెరుపుల్లేవు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">