చిత్ర పరిశ్రమలో చారిత్రక, నిజ జీవిత కథల ట్రెండ్ జోరందుకుంది. యథార్థ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అనేక సినిమాలొచ్చి ఆకట్టుకోగా... ఇప్పుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన యోధుడు తానాజీ మలుసరే కథ తెరపైకి వచ్చింది. ఆయన పాత్రలో బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ నటించిన సినిమా 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్'. తానాజీ సతీమణి సావిత్రి బాయి పాత్రలో కాజోల్ నటించింది.
తానాజీతో తలపడే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాధిపతి ఉదయ్‌భన్ రాఠోడ్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. భారీ యుద్ధ ఘట్టాలు, అజయ్, సైఫ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెప్పింది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఆకట్టుకుందా? అజయ్ వందో సినిమా ఆయన కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పింది?
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కథేంటంటే:
ఔరంగజేబు (ల్యూక్ కెన్నీ) తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారత దేశానికి విస్తరించాలని భావిస్తాడు. ఆ కార్యకలాపాల కోసం మరాఠా సామ్రాజ్యంలోని కొందన కోటను ఎంచుకుంటాడు. అయితే ఛత్రపతి శివాజీ (శరద్ కేల్కర్) ఆ కోటను స్వాధీన పర్చుకోమని తన సైన్యాధిపతి తానాజీని (అజయ్ దేవగణ్) ఆదేశిస్తాడు. ఔరంగజేబు తరఫున ఉదయ్‌భన్ రాఠోడ్ (సైఫ్ అలీ ఖాన్) సైన్యానికి నేతృత్వం వహిస్తాడు. ఆ కోట కోసం రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యంపై తానాజీ మెరుపు దాడులు చేస్తాడు. ఈ సమరం ఎలా జరిగింది? ఎవరు గెలిచారన్న విషయాలను తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
తానాజీ కథ తెలిసిందే అయినా.. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా దర్శకుడు దాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఉత్కంఠం నెలకొనేలా, ఆసక్తికరంగా సినిమాను మలిచారు. కథకు సరిపోయే నటీనటులను ఎంపిక చేయడంలో దర్శక, నిర్మాతలు వంద శాతం విజయం సాధించారు. ఇది సినిమాకు ప్రధాన బలమైంది.
>> ఓం రౌత్‌కు ఇది తొలి సినిమానే అయినా.. మంచి పట్టు ప్రదర్శించారు. భావోద్వేగాలు, డ్రామా, యాక్షన్‌ను సమతుల్యం చేసుకుంటూ చిత్రాన్ని రూపొందించారు.
>> నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.. కానీ పాటలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
>> యాక్షన్ డైరెక్టర్ రంజాన్ బులుత్ యుద్ధ సన్నివేశాల్ని డిజైన్ చేసిన విధానం కనువిందుగా ఉంటుంది. కొన్ని డైలాగ్స్ సన్నివేశానికి అతికినట్లు అనిపించవు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారంటే:
ఓం రౌత్ దర్శకత్వం చేసిన తొలి సినిమా ఇదే అయినా.. ఎక్కడా అలా అనిపించదు. గుండె ధైర్యం ఉన్న మరాఠా వీరుడుగా అజయ్ పాత్రకు ప్రాణం పోశారు. భర్తకు సహకరిస్తూ, అతడి విజయం కోసం ప్రార్థించే భార్యగా కాజోల్ తన పాత్రకు న్యాయం చేశారు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కథలో కీలకం. క్రూరత్వం నిండిన ఔరంగజేబు సైన్యాధికారి ఉదయ్‌భన్ రాఠోడ్‌గా సైఫ్ ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించారు. ఇది ఆయన సినీ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రం అనడంలో ఆశ్చర్యం లేదు. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఓ యోధుడి కథను అద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలతో తీశారు. 130 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో కథ మొత్తం ప్రథమార్ధంలో ఉండటం.. ద్వితీయార్థంలో కథకు స్కోప్ లేకపోవడం మైనస్ అయ్యింది.
బలాలు..
+ నటీనటులు
+ అద్భుతమైన విజువల్స్
+ యాక్షన్ సన్నివేశాలు
బలహీనతలు..
- పాటలు
- ద్వితీయార్ధం
చివరిగా..: తానాజీ... మెప్పించే మరాఠా యోధుడి కథ!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.