'అరే మామా కొత్త సినిమా మస్త్‌గా ఉందంటా. ఈ వీకెండ్ ప్లాన్ చేద్దాం'. ఇద్దరు కుర్రాళ్లు కలిస్తే ఈ మాట కామన్. యువతకు వినోదం (Entertainment In Youth)పంచేది అత్యధికంగా సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రముఖ వార్తా సంస్థ చేసిన సర్వేలో యువతకు తాజా వినోద మార్గాలివి.
ఓటీటీ: ఇది ఓటీటీ జమానా. సినిమా చూడటానికి కాళ్లీడ్చుకుంటూ థియేటర్‌కే వెళ్లాల్సిన అవసరమేం లేదు. ఒక్క క్లిక్‌తో ఫస్ట్ డే.. ఫస్ట్ షోను మన స్మార్ట్‌ఫోన్‌లోనే చూసేయొచ్చు. పెద్ద తెర కావాలనుకుంటే టీవీ, హోం థియేటర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడివరకైనా, ఏ సమయంలోనైనా చూసి ఆపేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5.. ఇలాంటి వేదికలు బోలెడు. కరోనా పీడ తొలగినా, యూత్ ఓటీటీకే అతుక్కుపోవడం వల్ల భవిష్యత్తులో సినిమాహాళ్లు కళకళలాడేది అనుమానమే అంటున్నాయి సర్వేలు.
పాడ్‌కాస్ట్: తమను మస్తీలో ముంచెత్తుతాయని యువత భావిస్తున్న మరో ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక పాడ్‌కాస్ట్. రేడియోకు ఆధునిక రూపమే పాడ్‌కాస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా అభిరుచికి అనుగుణమైన షోలు వినే అవకాశం ఉండటం వల్ల పాడ్‌కాస్ట్‌లు యువతను బాగానే ఆకట్టుకుంటున్నాయి. వినోదంతోపాటు విజ్ఞానాన్నీ పంచడం వీటికున్న ప్లస్‌పాయింట్.
మొబైల్ గేమింగ్: ట్వీన్స్, టీన్స్ నుంచి అంకుల్స్ దాకా మొబైల్ గేమింగ్‌కు ఫిదా అవుతున్న వారెందరో. ఇది తాజా వినోద సాధనంగా మారిపోయింది. హిందూ బిజినెస్‌లైన్ సర్వే ప్రకారం 2020లో దీని మార్కెట్ వాటా ఏడువేల కోట్లు ఉంటే.. 2023 నాటికి మూడురెట్లు అధికమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఈ ట్రెండ్ యూత్‌ను ఎంత హస్తగతం చేసుకుందో! ఒకవైపు కన్‌సోల్, కంప్యూటర్ వీడియోగేమ్‌లు విపరీతంగా అమ్ముడవుతుంటే మరోవైపు ఫ్రీ ఫైర్, లూడో కింగ్, క్యాండీ క్రష్‌లాంటి గేమ్స్‌కు క్రష్ అవుతున్న కుర్రకారూ ఎక్కువే.
సామాజిక మాధ్యమాలు: కాలేజీ విద్యార్థి, క్యాబిన్‌లో ఉద్యోగి.. ప్రతి ఒక్కరికీ అతిపెద్ద వినోద సాధనం సామాజిక మాధ్యమం. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్.. ఇలా వీటిని ఉపయోగించని వారు ఈ కాలంలో అరుదే. సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే కాదు.. వీటిని సమాచార, అనుబంధాల వారధిగా కూడా వాడుకుంటున్న వాళ్లు ఉన్నారు.
మొత్తానికి ఒకప్పుడు ఆటలు, సినిమాలతో ఆనందాన్ని ఆస్వాదించేవాళ్లం. ఇప్పుడు డిజిటల్ వేదికలపైనే వినోదాన్ని వెతుక్కుంటున్నాం అన్నమాట!
ఇదీ చూడండి: Google: వాయిస్ కాల్లో సమస్యలా?.. ఇలా ఫిక్స్ చేసుకోండి!