వరుసగా మూడు హిట్లు.. చిన్న వయసులోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం.. లవర్ బాయ్ ఇమేజ్.. ఇలా తెలుగుతెరపై ఓ వెలుగు వెలిగిన హీరో ఉదయ్ కిరణ్. అయితే 33 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని 2014లో తనువు చాలించారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణం! శనివారం (జూన్ 26) ఉదయ్ కిరణ్ జయంతి. ఈ సందర్భంగా తక్కువ వయసులోనే మరణించి, అభిమానులను శోకసంద్రంలో మిగిల్చిన కొందరు తారల గురించే ఈ కథనం.
సుశాంత్ సింగ్(Sushanth singh)
బుల్లితెర నటుడిగా కెరీర్ ఆరంభించి, స్టార్‌గా ఎదిగారు సుశాంత్. కెరీర్ పరంగానూ ఫామ్‌లోనే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా గతేడాది ముంబయిలోని తన ఇంట్లో ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు. పేరు, డబ్బు, ఫేమ్ ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో ఇప్పటికే తెలియలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
యశో సాగర్-హీరో(Yasho sagar)
'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన యశో సాగర్.. కారు ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. చేసింది ఒక్క సినిమానే అయినా సినీప్రియలు మదిలో చెరగని ముద్ర వేశారు.
కునాల్ సింగ్(Kunal singh)
తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు కునాల్. 1999లో విడుదలైన 'కథాలర్ దినమ్'(తెలుగులో ప్రేమికుల రోజు) సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన 2008 ఫ్రిబవరి 7 ముంబయిలోని తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించారు. అప్పటికి ఆయన వయసు 33ఏళ్లు. ఈ లోకాన్ని విడిచి 13ఏళ్లు అయినప్పటికీ ఇంకా ఆయన్ను అభిమానులు మనసులో దాచుకున్నారు.
సేతురామన్(Sehturaman)
సేతురామన్.. చేసింది నాలుగు సినిమాలే అయినా కోలీవుడ్‌లో మంచి నటుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. 'కన్న లడ్డు తిన్న ఆసియా' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. చివరి సారిగా 2019లో 50/50 సినిమాలో కనువిందు చేశారు. 2020 మార్చి 26న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
సంచారి విజయ్(Sanchari vijay)
అనతికాలంలోనే కన్నడ చిత్రసీమలో అద్భుత నటుడిగా గుర్తింపు పొందిన సంచారి విజయ్ (38) ఇటీవల కన్నుమూశారు. బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయ్‌గా 'రంగప్ప హోగ్బిట్నా' సినిమా ద్వారా అరంగేటంర్ చేశారు. రామరామ రఘురామ, దాసవాళ, అరివు, ఒగ్గరణె, నాను అవనల్ల అవళు, కిల్లింగ్ వీరప్పన్, మేలొబ్బ మాయావి.. సినిమాల్లో నటించారు. 2015లో ఆయన హిజ్రాగా నటించిన 'నాను అవనల్ల అవళు' సినిమాలోని అభియనయానికి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.
జేకే రితేశ్(JK ritesh)
తమిళ నటుడు జేకే రితేశ్.. 2019 ఏప్రిల్ 13న 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. 2019లో విడుదలైన 'ఎల్కేజీ' సినిమా ఆయనకు క్రేజ్ తెచ్చిపెట్టింది.
నితీశ్ వీరా(Nitish Veera)
తమిళ నటుడు నితీశ్ వీరా(45) ఈ ఏడాది మార్చి 17న కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. పుదుపెట్టాయ్, కుఝు, పడాయ్ వీరన్, వెన్నిలా కబడి కుఝు వంటి పలు హిట్ సినిమాల్లో నటించారు. రజనీకాంత్ 'కాలా', ధనుశ్ 'అసురన్' సినిమాల్లోనూ నటించారు.
సౌందర్య(Soundarya)
సౌందర్య-హీరోయిన్1990-2000 మధ్యలో టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించిన హీరోయిన్ సౌందర్య. అయితే 2004లో రాజకీయ ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటికీ ఆమె వయసు 32 ఏళ్లే.
ఆర్తి అగర్వాల్(Aarti agarwal)
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ 31 ఏళ్ల వయసులో మృతి చెందింది. బరువు తగ్గిందేకు లైపో ఆపరేషన్ చేస్తుండగా విఫలమై ఆమె చనిపోయిందనే ప్రచారం ఉంది. 2014లో ఈ కథానాయిక మరణించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్తి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించింది.
దివ్యభారతి(Divya Bharathi)
తెలుగులో 'బొబ్బిలిరాజా' సినిమాతో గుర్తింపు పొందిన హీరోయిన్ దివ్యభారతి.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా మృతి చెందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈమె మరణం.
అలనాటి తార సావిత్రి, హాస్యనటుడు వేణుమాధవ్, యాక్షన్ హీరో శ్రీహరి, సంగీత దర్శకుడు చక్రి, నటి సిల్క్ స్మిత ఇంకా పలువురు తారలు కూడా ఇలానే చిన్న వయసులోనే మృతిచెంది, అభిమానులకు శోకాన్ని మిగిల్చారు.