పశ్చిమ బంగ మంత్రి బ్రత్యా బసు తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకుని మెగా ఫోన్ పట్టారు. ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ హీరోయిన్గా 'డిక్షనరీ' అనే చిత్రాన్ని తీస్తున్నారు. మానవ సంబంధాలు, బంధుత్వాల మధ్య నెలకొంటున్న అగాధాలను చూపిస్తూ, సందేశాత్మకంగా దీనిని చిత్రీకరిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు బసు.
థియేటర్ ఆర్టిస్టుగా బెంగాలీ ప్రజలకు సుపరిచతమైన బ్రత్యా బసు.. దాదాపు 30 సినిమాల్లో నటించారు. 2010లో 'తారా' అనే బెంగాలీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న నుస్రత్ జహాన్.. గతేడాదే రాజకీయాల్లో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
"బ్రత్యా బసుతో పనిచేయాలని ఎప్పటినుంచే అనుకుంటున్నా. ఇన్నాళ్లకు ఆ ఆశ నెరవేరింది."
- నుస్రత్ జహాన్, కథానాయిక.
ప్రముఖ బంగ్లాదేశీ నటుడు మొషార్రఫ్ కరీమ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదీ చూడండి : ప్రేమపక్షులు: రజనీ, లత పరిణయానికి 39 ఏళ్లు