విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో వీడియోని రిలీజ్ చేసిన కారణంగా భారీ నష్టపరిహారం కోరుతూ ప్రముఖ చిత్ర నిర్మాత.. ఓ డిజిటల్ కంపెనీకి నోటీసులు పంపించారు. ప్రముఖ నటుడు విజయ్ కథానాయకుడిగా కోలీవుడ్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్టర్'. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, విడుదలకు ఒకరోజు ముందు 'మాస్టర్' చిత్రాన్ని పైరసీ చేసిన విషయం తెలిసిందే.
'మాస్టర్' కాపీని విదేశాలకు పంపించమని చిత్రబృందం ఓ డిజిటల్ సంస్థకు ప్రింట్‌ను అందించగా.. ఆ సంస్థకు చెందిన ఓ వ్యక్తే పైరసీకి పాల్పడ్డాడని ఇటీవల గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎంతో శ్రమించి తెరకెక్కించిన తమ చిత్రాన్ని పైరసీ చేసి.. తమకు ఇబ్బందులు కలిగించిన డిజిటల్ సంస్థను నష్టపరిహారం కోరుతూ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్ నోటీసులు పంపించారు. వెంటనే రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తెలుగులోకి నెట్‌ఫ్లిక్స్.. తొలి సిరీస్ విడుదల ఎప్పుడంటే?