నటుడిగా, కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా.. ఇలా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, తెలుగులో సైతం అభిమానుల్ని సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. దాదాపు రెండేళ్ల క్రితం 'సైరా'తో తెలుగువారిని అలరించిన ఆయన.. ప్రస్తుతం 'ఉప్పెన' చిత్రంతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో విజయ్.. ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. 'ఉప్పెన' ప్రీ రిలీజ్ వేడుక శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి తన మనసులోని మాట బయటపెట్టారు.
"తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్నా ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. చిరంజీవి సర్.. నాకు మీరంటే ఎంతో అభిమానం. 'సైరా' సమయంలో మొదటి సారి మిమ్మల్ని కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు మీపై గౌరవం పెరుగుతూనే ఉంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. 'ఉప్పెన' కథ చెప్పడం కోసం బుచ్చి నన్ను మొదటిసారి కలిసినప్పుడు.. 'తెలుగు సరిగ్గా రాదు. కానీ అర్థం చేసుకుంటాను. కాబట్టి మీరు తెలుగులో కథ చెప్పండి' అని చెప్పాను. దాంతో బుచ్చి నాకు తెలుగులోనే కథ చెప్పారు. ఆయన చెప్పిన డైలాగులు నాకెంతో నచ్చాయి. బుచ్చిబాబు కొన్నేళ్ల క్రితం దర్శకుడు సుకుమార్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారు. సుకుమార్ నుంచి ఎన్నో గొప్ప విషయాలు బుచ్చి నేర్చుకున్నారని ఈసినిమా షూట్‌లో అర్థమైంది. సుకుమార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన వర్క్ పట్ల నాకెంతో అభిమానం ఉంది. సుకుమార్ సర్.. నాకు కూడా ఒక్కఛాన్స్ ఇవ్వండి" అని దర్శకుడు సుకుమార్‌ను విజయ్ సేతుపతి కోరారు.
ఇదీ చూడండి: చిరు లీక్స్: కొత్త సినిమాపై మెగాస్టార్ క్లారిటీ