తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త ఊపును తెచ్చిన వారిలో వెంకటేశ్ ముందుంటారు. ఆయన మహేశ్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సింహభాగం మల్టీస్టారర్లే ఉన్నాయి. ఇక గతేడాది 'ఎఫ్2', 'వెంకీమామ' చిత్రాల రూపంలో మల్టీ విజయాలు ఖాతాలో వేసుకున్నారు.
కాగా.. వెంకీ ఇప్పుడు మరో యువ కథానాయకుడితో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అది మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు వీళ్లిద్దరి కోసమే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ అదిరిపోయే వినోదాత్మక కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీన్ని హారిక హాసినీ క్రియేషన్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా 'ఎన్టీఆర్ 30' ప్రాజెక్టు తర్వాతే సెట్స్‌పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోపు వెంకీ కూడా 'నారప్ప', 'ఎఫ్3' చిత్రాలతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక నాని చేతుల్లోనూ నాలుగు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగినా.. ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి వచ్చే ఏడాది ఆఖరు వరకైనా వేచి చూడక తప్పదు.