ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర కథానాయకుల్లో వెంకటేశ్(Venkatesh) శైలి కాస్త భిన్నమైంది. కొంతకాలంగా ఆయన ఎంచుకుంటున్న కథలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైతే ఇద్దరు పిల్లల తండ్రిగా, గురువుగా నటించడానికి సిద్ధంగా ఉంటారు. పైగా రీమేక్ కథలను రక్తికట్టించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే వెంకటేశ్(Venkatesh) సినిమాల సక్సెస్ రేటు ఎక్కువ. ఆయన కీలక పాత్రలో 2014లో వచ్చిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'దృశ్యం'. థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మలయాళ రీమేక్ అయినా, వెంకటేశ్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం 'దృశ్యం2'(Drushyam 2). ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ బాటపట్టింది. మరి రాంబాబుగా వెంకటేశ్ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తెలియాలంటే 'దృశ్యం2' (Drushyam 2 Review)చూడాల్సిందే!
చిత్రం: దృశ్యం2
నటీనటులు: వెంకటేశ్, మీనా, కృతిక, ఏస్తర్ అనిల్, సంపత్ రాజ్, నదియా, నరేశ్, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్, షఫీ తదితరులు; సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
ప్రొడక్షన్: సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్
నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి
రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్
విడుదల: అమెజాన్ ప్రైమ్
కథేంటంటే: వరుణ్ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన రాంబాబు (వెంకటేశ్) కుటుంబం ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్ టీవీ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్‌గా, ఓ సినిమాను నిర్మించే స్థాయికి ఎదుగుతాడు. అయితే వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా రాంబాబు భార్య జ్యోతి(మీనా)(Meena), పిల్లలు అంజు, అను (కృతిక, ఏస్తర్ అనిల్)(Esther Anil) భయంతో వణికిపోతుంటారు. పెద్ద కుమార్తె తీవ్ర మానసిక ఒత్తిడితో భయపడిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు వివాహం చేస్తే ఆరోగ్యం కుదట పడుతుందని రాంబాబు కుటుంబం భావిస్తుంది. మరోవైపు వరుణ్‌ను రాంబాబు హత్య చేసి ఉంటాడని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వల్ల ఆ కేసును సీక్రెట్‌గా విచారిస్తుంటారు. అదే సమయంలో ఐజీ గౌతమ్ సాహూ(సంపత్ రాజ్)(Sampath Raj) ఆ కేసును రీఓపెన్ చేస్తాడు. మరి వరుణ్ కేసు విషయంలో ఐజీకి దొరికిన ఆధారాలేంటి? అప్పుడు రాంబాబు ఏం చేశాడు? కేసు రీఓపెన్‌తో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఈ కేసు నుంచి బయటపడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ఒక సినిమా సీక్వెల్, లేదా ప్రీక్వెల్ తీయడం మామూలు విషయం కాదు. అదే విజయవంతమైన చిత్రమైతే అంచనాలు భారీగా ఉంటాయి. తొలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సన్నివేశాన్ని పోల్చి చూస్తుంటాడు ప్రేక్షకుడు. 'దృశ్యం'లాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph). ఇప్పటికే మలయాళంలో విడుదలైన చిత్రమే అయినా, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఫ్రెష్‌లుక్‌తో సినిమాను తీర్చిదిద్దాడు. మాతృకతో పోలిస్తే కథాగమనంలో స్వల్ప మార్పులు చేశారు. మలయాళ దృశ్యం2లో చివరివరకు చెప్పని కొన్ని ఆసక్తికర ఎలిమెంట్లను ప్రేక్షకుడికి కథ మరింత కనక్టయ్యే ఉద్దేశంతో ముందుగానే చెప్పారు. వాటికి వరుణ్ కేసుకు ఉన్న సంబంధం తెలియాలంటే క్లైమాక్స్ చూస్తేనే అర్థం అవుతుంది. వరుణ్ మిస్సింగ్ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు భయాలతో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది చూపించాడు. ఇందుకోసం కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి.
వరుణ్ కేసును పోలీస్‌శాఖ సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు తెలియడం వల్ల ప్రేక్షకుడిలో ఉత్కంఠ మొదలవుతుంది. అక్కడ దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు. హత్య జరిగిన తర్వాత రాంబాబు ఏం చేశాడన్న దానిపై పోలీసుశాఖ విచారణ మొదలుపెడుతుంది. అక్కడి నుంచి తెరపై కథ, కథనాల్లో, సినిమా చూస్తున్న పేక్షకుడి గుండెల్లో వేగం పెరుగుతుంది. వరుణ్ కేసు నుంచి ఈసారి రాంబాబు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడన్న ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులతో ఉత్కంఠతో సాగిపోతుంటుంది. ముఖ్యంగా చివరి గంటలో మలుపులు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడతాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి వరుణ్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకొని లొంగిపోవడం వల్ల కథ అయిపోతుందేమో అని అనుకున్న ప్రేక్షకుడికి ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అది తెరపై చూస్తేనే బాగుంటుంది. రాంబాబు హత్య కేసు విషయమై జరిగే కోర్టు సన్నివేశాలన్నీ అలరిస్తాయి. రాంబాబు గురించి ఐజీ గౌతమ్ సాహూతో తనికెళ్ల భరణి చెప్పడం, అది విని పోలీసులు ఆశ్చర్యపోవటం ఇలా వరుస ఆసక్తికర సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది. ఒక మంచి థ్రిల్లర్‌ను చూశామన్న సంతోషం ప్రేక్షకుడిలో కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: రీమేక్ కథలు, అందులోని పాత్రలను వెంకటేశ్(Venkatesh) ఆకళింపు చేసుకున్నట్లు మరొక నటుడు చేయలేడంటే అతిశయోక్తికాదు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన ఎన్నో సినిమాల ద్వారా నిరూపించారు. 'దృశ్యం'లో ఇద్దరు బిడ్డల తండ్రిగా కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎలాగైతే రాంబాబు పాత్రలో ఒదిగిపోయారో.. 'దృశ్యం2'లో అదే స్థాయి నటన కనబరిచారు. 'నారప్ప', 'దృశ్యం2' చిత్రాలు వెంకటేశ్‌ను నటుడిగా మరోస్థాయిలో నిలబెట్టాయి. రాంబాబు భార్య పాత్రలో మీనా, కుమార్తెలుగా కృతిక, ఏస్తర్‌లు తమ పరిధి మేరకు నటించారు. మొదటి భాగంలో లేని కొన్ని పాత్రలు ఇందులో వచ్చాయి. ముఖ్యంగా ఐజీగా సంపత్‌రాజ్, కానిస్టేబుల్‌గా సత్యం రాజేశ్, రచయితగా తనికెళ్ల భరణి, లాయర్‌గా పూర్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సతీశ్ కురుప్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. మాతృక తీసిన అనుభవం ఉండటం వల్ల సులభంగా పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా సన్నివేశానికి తగినట్లు ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దాడు. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది.
దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph) మలయాళంలో 'దృశ్యం2' (Drushyam 2)ను సవాల్‌గా తీసుకుని తెరకెక్కించారు. ఎందుకంటే సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్స్‌లో ఒక సినిమాలో ఒక కేసు గురించి పరిశోధిస్తే, మరో సినిమాలో ఇంకో కేసును కథానాయకుడు ఎలా ఛేదించాడన్నది చూపించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, 'దృశ్యం'లో ముగిసిన కేసును రీఓపెన్ చేస్తే, దాన్ని కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. రాంబాబు కుటుంబ జీవితాన్ని ఎలా గడుపుతున్నాడన్నది చూపించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపించింది. అయితే మలయాళం మాతృకతో పోలీస్తే సన్నివేశాలు కుదించినట్లు అనిపించింది. ద్వితీయార్ధంలో కథ, కథనాలను పరుగులు పెట్టించిన విధానం మెప్పిస్తుంది. కరోనా కారణంగా అతి తక్కువ లొకేషన్స్‌లోనే సినిమా పూర్తి చేశారు. చివరి వరకూ థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నా, పరిస్థితులు సహకరించకపోవడం వల్ల మాతృక బాటలోనే పయనించింది.
బలాలు
+ కథ, కథనం
+ వెంకటేశ్
+ దర్శకత్వం
బలహీనతలు
- ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: 'దృశ్యం'కు పర్‌ఫెక్ట్ సీక్వెల్ 'దృశ్యం2'.. వెంకీమామ నటన అల్టిమేట్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Adbhutam review: తేజ నిజంగానే 'అద్భుతం' అనిపించాడా?