చిత్రసీమలో గతేడాది కనిపించిన పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. కరోనా ఉధ్ధృతితో ఒక పక్క థియేటర్లు వెలవెలబోతున్నాయి. మరోపక్క చిత్రీకరణలూ ఒకొక్కటిగా ఆగిపోతున్నాయి. అగ్ర తారల చిత్రాలు దాదాపు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రకటించిన తేదీ ప్రకారం అగ్ర తారల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
కరోనాతో 2020 ఎలాగో తుడిచిపెట్టుకుపోయింది. 2021లోనైనా దూసుకెళ్దాం అన్నట్టుగా వరుస సినిమాలతో హుషారుగా కనిపించారు హీరోలు. ఒకపక్క కరోనా భయపెడుతున్నా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. పరిస్థితులకు అలవాటు పడుతూ చిత్రీకరణల్ని కొనసాగించారు. ఎలాగైనా ఈ ఏడాది తమ సినిమాల్ని ప్రేక్షకులకు చూపించాల్సిందే అనే తపనతో కనిపించారు. కానీ మరోసారి కరోనా కరడుగట్టిన విలన్‌లా అడ్డుపడింది. అయితే గత కొన్నాళ్లుగా రెండో దశ కరోనా ఉధృతంగా కనిపిస్తున్నా చిత్ర బృందాలు మాత్రం వెనకడుగు వేయలేదు. చాలా సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటూనే వచ్చాయి. కానీ ఆయా చిత్రబృందాల్లోని కీలక సభ్యులే కరోనా బారిన పడటం వల్ల ఇక చేసేదేం లేక చిత్రీకరణల్ని ఆపేస్తున్నారు.
*చిరంజీవి, రామ్‌చరణ్ కథా నాయకులుగా నటిస్తున్న 'ఆచార్య' మొన్నటివరకు శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంది. రామ్‌చరణ్, ఇతర చిత్రబృందంపై కొన్ని పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ చిత్రబృందంలో ఒకరైన సోనూసూద్ కూడా ఇటీవల కరోనా బారిన పడ్డారు. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న 'ఎఫ్3' కొత్తషెడ్యూల్ మొదలుపెట్టారో లేదో, అంతలోనే దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ సినిమా చిత్రీకరణను నిలిపేశారు.
* ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు చిత్రాలూ కరోనా ప్రభావంతోనే ఆగిపోయాయి. కొన్నాళ్ల కిందటివరకూ ముంబయిలో 'ఆదిపురుష్' చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రభాస్. అయితే అక్కడ కరోనా తీవ్రత ఎక్కువ కావడం వల్ల అక్కడ షూటింగ్ నిలిపివేశారు. దాంతో 'రాధేశ్యామ్' చిత్రీకరణనైనా పూర్తి చేద్దామని ఆయన హైదరాబాద్‌కు వచ్చేశారు. కానీ చిత్రీకరణ మాత్రం మొదలుపెట్టలేకపోయారు. కరోనా భయాలే అందుకు కారణం. మహేష్‌బాబు 'సర్కారు వారి పాట' చిత్రబృందంలో కూడా పలువురికి కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల ఆ సినిమా చిత్రీకరణ కూడా నిలిపేశారు. మిగిలిన సభ్యులు కూడా పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చాకే మొదలుపెట్టనున్నారు. నాగచైతన్య 'థ్యాంక్‌యూ' చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. ఆ క్రమంలో యూనిట్‌లో కొందరికి కొవిడ్ అని తేలడం వల్ల ఆగిపోయారు. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణలోనూ గత కొన్ని రోజులుగా పురోగతి లేదు. కొన్నివారాల కిందటి వరకూ పవన్ కల్యాణ్ రెండు చిత్రాలతో బిజీగా గడిపారు. ఆయనకి కొవిడ్ పాజిటివ్ అని తేలడం వల్ల ఆ రెండూ నిలిచిపోయాయి. కొందరు నటులు చిత్రీకరణల్లో పాల్గొనడానికి వెనకంజ వేస్తున్నారు.
* చిత్రీకరణల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రదర్శనల సంగతి సరే సరి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొన్ని చోట్ల ‘తగిన సినిమాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా ప్రదర్శనల్ని రద్దు చేస్తున్నాం’ అనే బోర్డులు పలు థియేటర్ల ముందు కనిపిస్తున్నాయి. అగ్ర తారల చిత్రాల విడుదలలు వాయిదా పడటంతో, పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.