హిందీలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా మారాడు ఆయుష్మాన్ ఖురానా. 'విక్కీ డోనర్', 'అంధాధున్', 'ఆర్టికల్ 15', 'బాలా', 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' వంటి విభిన్న చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ హీరో సినిమా విడుదలవుతుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయుష్మాన్ సినిమాల్లోకి రాక ముందున్న పరిస్థితుల గురించి వివరించాడు.
"మంచి సినిమాతో అరంగేట్రం చేయాలని ఐదారు కథలకు నో చెప్పా. మొదటి చిత్రం ఎప్పుడూ ప్రత్యేకం కాబట్టి అలా చేశా. ఎందుకంటే నేను సినిమా కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు. ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే మరో అవకాశం రాదు. థియేటర్ షో కోసం వెళ్లే సమయంలో రైలు ప్రయాణంలో పాటలు పాడుతూ ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. అవి నా గోవా పర్యటనకు ఉపయోగపడ్డాయి. నేనో సింగర్‌ని కాబట్టి ట్రైన్లో అలా పాటలు పాడేవాడిని."
-ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ హీరో
ఈ హీరో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. 'అంధాధున్' చిత్రంలోని నటనకు గానూ అవార్డు దక్కింది.