స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తీస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. అందువల్ల దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయాలని భావించి, కేరళను ఎంచుకున్నారు. ఇప్పటికే అక్కడి అడవుల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసి, లాక్డౌన్ కారణంగా చిత్రీకరణను నిలిపేశారు. అయితే కేరళలో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తాజాగా ఆ ఆలోచనన విరమించుకున్నారు.
మన నేటివిటీకి దగ్గరగా, సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే చిత్రీకరణ ఇక్కడే చేయాలని భావిస్తోంది చిత్రబృందం. అందుకు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి సిద్ధమవుతోంది. తెలంగాణలోని వికారాబాద్, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు తాజాగా అనుమతిచ్చిన నేపథ్యంలో 'పుష్ప' యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది బన్నీ, సుకుమార్‌ల హ్యాట్రిక్ చిత్రం కావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి... లైంగిక వేధింపుల వల్ల ఇండస్ట్రీకి హీరోయిన్ గుడ్‌బై