క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి 'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భామ రీతూవర్మ. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తోన్న రీతూవర్మ నటించిన కొత్త చిత్రం 'టక్ జగదీష్'. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివే..
మొట్టమొదటిసారి ఇలా..
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ 11 సినిమాలు చేశాను. మొత్తంగా 11 విభిన్నమైన పాత్రల్లో నటించాను. మొట్టమొదటిసారి 'టక్ జగదీష్' వంటి పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంలో నటించాను. ఇందులో నా పాత్ర పేరు గుమ్మడి వరలక్ష్మి. వీఆర్వోగా పనిచేస్తుంటాను. గ్రామీణ యువతిని కావడం వల్ల ఓ వైపు సంప్రదాయాలకు విలువనిస్తూనే మరోవైపు నా మనసు చెప్పిందే ధైర్యంగా చేస్తుంటాను.
కొంచెం బాధగా ఉంది..!
‘టక్ జగదీష్’.. కమర్షియల్ హంగులకు ఏ మాత్రం తీసిపోని ఓ కుటుంబ కథా చిత్రం. ఈ సినిమా థియేటర్ల కోసమే రూపొందించాం. కాకపోతే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ రిలీజ్‌కు నిర్మాతలు అంగీకరించారు. అలా, మా సినిమా ఓటీటీ బాటపట్టింది. థియేటర్‌లో సినిమా విడుదల కానందుకు నాకు కొంత బాధగా ఉంది. కానీ తప్పదు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓటీటీకి కూడా ఆదరణ పెరిగింది. దానివల్ల మా సినిమా అతి తక్కువ సమయంలోనే ఎక్కువమందికి చేరుతుందని మేము నమ్ముతున్నాం.
నేను తెలుగమ్మాయిని కాదు..!
నిజం చెప్పాలంటే నేను పూర్తిస్థాయి తెలుగమ్మాయిని కాదు. మా కుటుంబం ఉత్తరాదికి చెందినది. ఇటు వలస వచ్చేశారు. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. దానివల్లే అందరూ నన్ను తెలుగమ్మాయిగా భావిస్తున్నారు. ఇక్కడ వాళ్లు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు.
గ్లామర్‌కు నో అని కాదు..!
ఒక నటిగా నాకు అన్నిరకాల పాత్రలు చేయాలని ఉంది. అందుకు అనుగుణంగానే విభిన్నమైన పాత్రలు స్వీకరిస్తున్నాను. వాటిల్లో నాకు నచ్చినవే ఓకే చేస్తున్నాను. 'పెళ్లి చూపులు' తర్వాత కూడా అదే తరహా కథలు నా వద్దకు వచ్చాయి. కాకపోతే నేను వాటికి అంగీకారం తెలుపలేదు. ఆ సినిమా తర్వాతే నాకు తమిళంలోనూ మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకూ చేసిన సినిమాల పట్ల ఆనందంగా ఉంది. ఎలాంటి విచారం లేదు. అంతేకాకుండా గ్లామర్ పాత్రలు చేయకూడదని ఏమీ లేదు. నా వద్దకు వచ్చిన పాత్రల్లో నాకు బాగా నచ్చివని మాత్రమే ఎంచుకుంటున్నాను.
దర్శకుల నటి..!
నేను డైరెక్టర్స్ యాక్టర్. దర్శకుడు ఏం చెబితే అలా చేస్తాను. ఆయన ఎలాంటి సన్నివేశం చెబితే అలా నటిస్తాను. నిజం చెప్పాలంటే నేను సిటీ గర్ల్. ఇప్పటివరకూ పల్లెటూర్లు, టౌన్లకు వెళ్లలేదు. కానీ, ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో నటించడానికి దర్శకుడు శివ నిర్వాణ నాకెంతో సాయం చేశారు. ఆయన చెప్పిన విధంగానే నటించాను. ఆ పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.
నాని.. సెల్ఫ్ మేడ్ యాక్టర్..!
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తర్వాత నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నా పాత్ర చాలా చిన్నది. దానివల్ల నానితో మాట్లాడడం కుదరలేదు. కానీ ఇప్పుడు ఆయనకు జోడీగా నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో మాట్లాడడానికి సమయం దొరికొంది. ఆయన చాలా మంచి వ్యక్తి. సపోర్టివ్.. ప్రోత్సహించే వ్యక్తి. సెల్ఫ్ మేడ్ యాక్టర్. సినిమా సినిమాకూ తనలోని నటుడ్ని ఆయన ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నానితో ఛాన్స్ వస్తే మరోసారి నటించాలని ఉంది.
ఎలా మేనేజ్ చేశారో..!
‘మజిలీ’ , ‘నిన్నుకోరి’ సినిమాలు చూశాక.. శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనిపించింది. ఆ రెండు చిత్రాలు నాకెంతో నచ్చాయి. ఆ క్రమంలోనే 'టక్ జగదీష్'లో అవకాశం రాగానే ఓకే చేసేశాను. సెట్‌లో ప్రతి రోజూ చాలా సరదాగా గడిచేది. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ సినిమా కోసం పనిచేశారు. అంతమంది నటీనటుల్ని శివ ఎలా మేనేజ్ చేయగలిగారో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మాలో మాకు ఎలాంటి పోటీ లేదు. అందరం ఆడుతూ పాడుతూ షూట్ పూర్తి చేశాం.
కామెడీ ఉంటుంది..!
ఈ సినిమా కామెడీ ఉండదని అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు చూడొచ్చు. ముఖ్యంగా నాకు, నానికి మధ్య మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలుంటాయి.
తదుపరి చిత్రాలు..!
నాగశౌర్యతో చేసిన ‘వరుడు కావలెను’ అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. శర్వానంద్‌తో ‘ఒకే ఒక్క జీవితం’ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాను. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ ఓకే చేశాను. అయితే ఇంకా సంతకం చేయలేదు. కానీ చేస్తానని మాటిచ్చాను. ఇది మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో ‘ధ్రువ నక్షత్రం’ అనే సినిమా ఉంది. అది ఎప్పుడో వాయిదా పడింది. ఇప్పటికైనా ఆ సినిమా పూర్తవుతుందని భావిస్తున్నాను. అలాగే, చిన్నప్పటి నుంచి నేను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒకవేళ హిందీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చేస్తాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: