వైవిధ్యభరిత కథలతో ఏ కొత్త దర్శకుడు తలుపు తట్టినా.. ఇమేజ్ చట్రాలు, అనుభవాల లెక్కలు పక్కకు నెట్టేస్తున్నారు అగ్ర హీరోలు. స్తుతం తెలుగులో పలువురు టాప్ హీరోస్ ఇదే బాటలో నడుస్తున్నారు. సీనియర్, జూనియర్ అన్న తేడాలు లేకుండా కుర్ర దర్శకులతో కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు.
పవన్ యంగ్ ధమాకా..
కొత్త దర్శకులతో ప్రయాణాన్ని ఎప్పుడూ ఇష్టపడుతుంటారు కథానాయకుడు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా ఇప్పటి వరకు 25 సినిమాలు చేయగా.. వాటిలో సింహభాగం కొత్త దర్శకులతో చేసిన సాహసాలే. రీఎంట్రీలోనూ ఇదే పంథాలో నడుస్తున్నారు. ప్రస్తుతం తన 'వకీల్‌సాబ్' యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వేణుకిది మూడో చిత్రమే. పవన్ త్వరలో చేయనున్న 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ సైతం సాగర్.కె చంద్ర అనే యువ దర్శకుడి చేతుల్లోనే పెట్టారు. ఆయనదీ రెండు చిత్రాల అనుభవమే.
అటు అనిల్.. ఇటు తరుణ్..
అగ్ర కథానాయకుడు వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది పూర్తయిన వెంటనే వెంకీ చేయనున్న సినిమాలన్నీ యువ దర్శకులతోనే ఉండబోతున్నాయి. వీటిలో అనిల్ రావిపూడి 'ఎఫ్2' సీక్వెల్‌తో పాటు తరుణ్ భాస్కర్ తెరకెక్కించనున్న కొత్త చిత్రం ఉన్నాయి. అయితే వీటిలో ముందు సెట్స్‌పైకి వెళ్లేది ఏమిటన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
చిరు కోసం బాబీ..
'చిరంజీవితో ఒక్క చిత్రమైనా చేయాలి'... వెండితెరపై ఓ వెలుగు వెలగాలని తాపత్రయ పడే ప్రతి దర్శకుడు కనే కల ఇది. ఇలాంటి అపురూప అవకాశం అందుకున్నారు యువ దర్శకుడు బాబీ. 'ఆచార్య' చిత్రం తర్వాత చిరంజీవి జాబితాలో బాబీ సినిమా ఉంది. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నారు ఈ యువ దర్శకుడు. మెహర్ రమేష్‌తో చేయనున్న 'వేదాళం' రీమేక్ పూర్తికాగానే బాబీ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది.
మహేశ్‌తో పరశురామ్..
యువత' ద్వారా తొలి ప్రయత్నంలోనే ఓ చక్కటి విజయంతో వెండి తెరపై కాలుమోపిన దర్శకుడు పరశురామ్. 'గీత గోవిందం'తో రూ.100కోట్ల వసూళ్లు కొల్లగొట్టి స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే అగ్ర హీరో మహేష్‌బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు.
వీరిద్దరి కలయిక నుంచి రాబోతున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. త్వరలోనే విదేశాల్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:మాటే మంత్రం.. ఈ త్రివిక్రముడి తంత్రం