కథానాయకులంతా కొన్నేళ్లకు సరిపడా కథల్ని విని పక్కా చేసుకున్నారు. లాక్‌డౌన్ అందుకు బాగా కలిసొచ్చింది. ఇక నుంచి ఆ కథల్లో ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వెళ్లడమే పని. కథానాయికల్లో మాత్రం చాలా మంది లాక్‌డౌన్‌కు ముందు ఒప్పుకున్న సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నారు. కొత్త చిత్రాల విషయంలో వాళ్లు పెద్దగా జోరు ప్రదర్శించడం లేదు. సమంత, అనుష్క లాంటి భామలైతే ఇప్పటికీ కొత్త సినిమాల్ని ప్రకటించలేదు. అలాగని వచ్చిన కథల్లో ఏదో ఒకటి ఒప్పేసుకుని రంగంలోకి దిగుదామనే తొందర వాళ్లలో కనిపించడం లేదు. నచ్చితేనే చేస్తాం అంటున్నారు. అలాగని వాళ్లు ఖాళీగా ఏమీ ఉండడం లేదు. ఇతరత్రా ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెడుతున్నారు. ఏది ఆసక్తికరంగా అనిపించినా సై అంటూ పచ్చజెండా ఊపేస్తున్నారు.
కొత్త వేదికవైపు చూపు
సమంత స్టార్ కథానాయిక స్థాయిని ఎప్పుడో అధిగమించింది. ఆమె కథ మొత్తాన్ని భుజాన మోయగల నటి అని నిరూపించుకుంది. కొన్నాళ్లుగా అందుకు తగ్గ కథలపైనే దృష్టి పెడుతూ ప్రయాణం చేస్తోంది. అయితే అలాంటి కథలు అన్నిసార్లూ అందుబాటులో ఉండవు. తెలుగుతోపాటు తమిళంలోనూ మార్కెట్‌ను సంపాదించుకున్న సమంత రెండు చోట్లా నాయిక ప్రాధాన్య కథల్ని వింటోంది. కానీ ఇంకా కథలు పక్కా కాలేదు. అయితే ఈలోపు ఆమె కొత్త వేదికపై దృష్టి పెట్టింది. అదే...ఓటీటీ. 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో ప్రతినాయక ఛాయలతో కూడిన పాత్ర చేసిన సమంత, ఆ సిరీస్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. అలాగే 'ఆహా'లోనూ శ్యామ్ జామ్ అనే టాక్‌షో చేస్తోంది.
"ప్రాంతీయ చిత్రాలను ప్రపంచానికి తీసుకెళ్లడంలో ఓటీటీ వేదికలు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రాంతీయ భాషా నటులు, సాంకేతిక నిపుణులకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి ఓటీటీ వేదికలు" అని చెబుతోంది సమంత. తమన్నా కూడా స్టార్ నాయికే. ఆమె కూడా కొత్త వేదికపై దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొంటోంది. ప్రస్తుతం 'లెవెన్త్ అవర్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. సినిమానే కాదు, నచ్చిందంటే దేనికైనా సై అంటోందామె.
వీళ్లది మరో రూటు
తారలు ఒక్కసారి స్టార్ స్థాయికి చేరుకున్నారంటే అందుకు తగ్గ కథలు, కాంబినేషన్లతోనే ప్రయాణం చేయాలనుకుంటారు. అందుకు విరుద్ధంగా ప్రయాణం చేస్తే ఎక్కడ స్థాయి తగ్గిందనే సంకేతాలు వెళతాయో అనే భయాలు వాళ్లలో కనిపిస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినా కాంబినేషన్లు నచ్చలేదంటే 'నో' చెప్పస్తుంటారు. కానీ నవతరం నాయికలు అలాంటి భయాల్ని దూరం పెట్టేస్తున్నారు.
రకుల్‌ప్రీత్ సింగ్ తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషల్లోనూ జోరు చూపుతోంది. ఎక్కువగా స్టార్ హీరోలతోనే నటిస్తున్న ఈమె, ఇటీవల యువ హీరో వైష్ణవ్‌తేజ్‌తో జోడీ కట్టింది. క్రిష్ దర్శకుడు కావడం, కథ నచ్చడంలాంటి కారణాలు రకుల్‌పై ప్రభావం చూపించి ఉంటాయి. మరో నాయిక రష్మిక కూడా కొన్నాళ్లుగా అగ్ర హీరోల సరసనే నటిస్తోంది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటిస్తున్న ఆమె, ఊహించని రీతిలో యువహీరో శర్వానంద్‌తో జోడీ కట్టింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న శర్వా హీరోగా వస్తున్న 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో ఆమె నాయికగా నటిస్తోంది. కథ నచ్చిందంటే కాంబినేషన్ల సంగతిని కూడా పక్కనపెట్టి సై అనేస్తాం అని మరోమారు నిరూపించింది రష్మిక.