వెండితెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును కొల్లగొడుతుంటారు నటీనటులు. వీరి సినిమాలకు తగినన్ని నిధులు సమకూర్చే పనిలో నిర్మాణ సంస్థలు ఉంటాయి. అయితే.. క్రమంగా ఈ ట్రెండ్ మారుతోంది. నటీనటులే సొంతంగా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తూ కెరీర్లో విజయవంతమవుతున్నారు. తమ సంపాదననూ రెట్టింపు చేసుకుంటున్నారు. గతంలో ఈ మార్పు బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలోనూ ఈ మార్పులను చూస్తున్నాం.
టాలీవుడ్ అగ్ర హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్ సహా మంచు విష్ణు, కళ్యాణ్ రామ్.. నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ నటుల నిర్మాణ సంస్థల గురించి తెలుసుకుందాం..
టాలీవుడ్లో వీరే..
ప్రముఖ నటుడు మహేశ్ బాబు జీఎంబీ(జీ మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్)(GMB entertainment movies) ప్రొడక్షన్ సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. మహేశ్ నటించిన 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కాయి. ప్రస్తుతం 'మేజర్', 'సర్కారు వారి పాట' సినిమాలకూ జీఎంబీ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఇదే దారిలో రామ్ చరణ్
టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను(Konidela Productions company) ఏర్పాటు చేశారు. 'ఖైదీ నంబర్ 150', 'సైరా నర్సింహారెడ్డి' చిత్రాలను నిర్మించింది ఈ సంస్థే. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాకూ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
మంచు విష్ణు
ఇటీవలే 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. 2007లోనే '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ'(24 frames factory movies) అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే.. గతంలోనే విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అదే దారిలో పయనిస్తున్నారు విష్ణు.
కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ యన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను(NTR arts movies) ఏర్పాటు చేశారు. 'జై లవ కుశ' సహా పలు హిట్ చిత్రాలు ఈ పతాకంపై తెరకెక్కాయి.
కొత్త నటుల్లోనూ..
కొత్తగా వెండితెరకు పరిచయమై మంచి హిట్ సినిమాల్లో నటించిన కొందరు టాలీవుడ్ నటులు కూడా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నారు. యువ నటుడు విజయ్ దేవరకొండ(vijay devarakonda production house) ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
బాలీవుడ్లో వీరే టాప్..
ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ సహా చాలా మంది నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి భారీ జడ్జెట్ సినిమాలు తెరకెక్కించారు.
- షారుక్ ఖాన్- రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
- అక్షయ్ కుమార్- హరి ఓం ఎంటర్టైన్మెంట్ కంపెనీ
- ప్రియాంకా చోప్రా జోనస్- పర్పుల్ పెబల్ పిక్చర్స్
- అజయ్ దేవ్‌గణ్- అజయ్ దేవ్‌గణ్ ఎఫ్ ఫిల్మ్స్
- ఆమీర్ ఖాన్- ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
- అనుష్క శర్మ- క్లీన్ స్లేట్ ఫిలింస్
- సైఫ్ అలీ ఖాన్- ఇల్లుమినటి ఫిల్మ్స్
- ఫర్హాన్ అక్తర్- ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్
- జాన్ అబ్రహం- జేఏ ఎంటర్టైన్మెంట్
ఇదీ చదవండి: