యువ కథానాయకుడు నితిన్ ఇంట పెళ్లి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అతడి వివాహానికి కరోనాతో చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో షాలినితో ఈ హీరోకు నిశ్చితార్థమైంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు భారతీయులకు ఆంక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హీరో పెళ్లి తేదీ మారుతుందా? లేదంటే హైదరాబాద్‌లోనే పరిణయ వేడుక జరుగుతుందా అనే దానిపై సందిగ్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నితిన్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'రంగ్‌దే'లో నటిస్తున్నాడు. ఇటీవలే 'అంధాధున్' రీమేక్‌ను పట్టాలెక్కించాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడుగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్ యేలేటితో ఓ చిత్రం చేస్తున్నాడీ కుర్రహీరో. 'చెక్' అనే పేరుతో ప్రచారంలో ఉంది ఆ సినిమా. మరోవైపు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో ఆయన మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు.