గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఈ కారణంగా ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవబోతుంది.
సై అంటున్న సైరా..
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా: నరసింహారెడ్డి. రూ. 300 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
![MOVIE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/chiranjeevi_1908newsroom_1566223363_47.jpg)
అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు.
హృతిక్ - టైగర్ వార్..
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం వార్. ఈ సినిమా కూడా గాంధీ జయంతి పురస్కరించుకుని విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమైంది. బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సైరాతో పోటీపడనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.
![MOVIE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/war01_2609newsroom_1569508352_686.jpg)
జోకర్ నవ్విస్తాడా.. కవ్విస్తాడా..
డీసీ కామిక్స్ సృష్టించిన ప్రతినాయకుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుతెచ్చుకున్న విలన్ జోకర్. ముఖ్యంగా బ్యాట్‌మ్యాన్‌ను ముుప్పుతిప్పలు పెట్టి.. అత్యంత క్రూరమైన విలన్‌గా పేరుగాంచాడు జోకర్. అతడు ఎందుకు అలా మారాడో ఈ సినిమాలో చూపించనున్నారు. ఆర్థర్ ఫ్లెక్ అనే స్టాండప్ కమెడియన్ తన వృత్తిలో రాణించలేకపోతాడు. అంతే కాకుండా సమాజం నుంచి ఎన్నో అవమానాలకు గురై.. క్రిమినల్‌గా మారతాడు. ఇందులో జాక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్ర పోషించాడు.
![MOVIE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/joaquin_phoenix_0809newsroom_1567920656_199.jpg)
ఈ వారంలో మరో రెండు సినిమాలు..
ఇవి గాకుండా ఈ వారంలో తమిళంలో 100% కాదల్, అసురన్ చిత్రాలు ప్రేక్షకుల మందుకు రానున్నాయి. నాగచైతన్య నటించిన 100% లవ్ చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన 100% కాదల్‌లో జీవీ ప్రకాశ్ నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఇందులో షాలిని పాండే కథానాయిక. ‘అసురన్’లో భిన్నమైన గెటప్‌లో నటించిన ధనుష్ జాతీయ అవార్డుపై దృష్టి పెట్టిపెట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండి: సైరాతో మాకు పోటీ లేదు: వార్ హీరో టైగర్