Raviteja New Movie: రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఉగాది రోజున సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. మోస్ట్ వాంటెడ్ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోనున్నారని... ఆయన యాస, హావభావాలు కొత్తగా ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి.
Megha Aakash New Movie: రాహుల్ విజయ్ కథా నాయకుడిగా ఓ కొత్త చిత్రం మొదలైంది. ఇందులో మేఘ ఆకాష్ కథానాయిక. అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎ.సుశాంత్‌రెడ్డి, అభిషేక్ కోట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్న ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ "గోవా నేపథ్యంలో సాగే రొమాంటిక్ కథ ఇది. ఆసక్తి రేకెత్తించే వినోదంతో రూపొందుతుంద"న్నారు. నిర్మాత సుశాంత్‌రెడ్డి మాట్లాడుతూ "హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 10 రోజులు చేసే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంద"న్నారు. మేఘ ఆకాష్ మాట్లాడుతూ "మా అమ్మ సమర్పిస్తున్న చిత్రమిది. నాకు మరింత ప్రత్యేకం. 'డియర్ మేఘ' తర్వాత సుశాంత్, అభిమన్యుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంద"న్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ "మంచి కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమిది. రొమాంటిక్ కామెడీ కథగా ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తుంద"న్నారు. వెన్నెల కిషోర్, అర్జున్‌కల్యాణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర.
My Name is Shruthi New Song: హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శృతి'. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని 'రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత, తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట...' అంటూ సాగే పాటకి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ్ ఆలపించారు. మార్క్ రాబిన్ స్వరకర్త. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ "ఇలాంటి కథని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలో ఉండే మలుపులు అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తాయ"న్నారు. నిర్మాత మాట్లాడుతూ "వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నార"న్నారు. మలుపులు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తాయని దర్శకుడు చెప్పారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్, ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, పూజా రామచంద్రన్, కేదార్‌శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కిషోర్ బోయిడపు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Mishan Impossible New Song: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్‌ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన ముగ్గురు పిల్లల కథేమిటో తెలియాలంటే 'మిషన్ ఇంపాజిబుల్' చూడాల్సిందే. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్.ఆర్.ఎస్.జె తెర కెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలోని 'ఏంట్రా అదృష్టం తెగ తట్టిందా తలుపూ... సిట్టి బుర్రల్లో మరి ఎలిగిందా బలుబూ...' అంటూ సాగే పాటని మంగళవారం విడుదల చేశారు. సేనాపతి భరద్వాజ పాత్రుడు రచించిన ఈ గీతాన్ని మార్క్ కె.రాబిన్ స్వరపరిచారు. ఆయనే హరిచరణ్‌తో కలిసి ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: తారక్‌తో అలా.. చెర్రీతో ఇలా.. 'ఆర్ఆర్ఆర్' కాంబినేషన్లు అదుర్స్!