దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హీరోగా ఓ సినిమా చేయనున్నారు. దానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహించనున్నారు. అందులో నలుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఇటీవల 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న భరణి.. రాఘవేంద్ర రావుతో, అదీ నలుగురు హీరోయిన్లతో సినిమా ఎలా కుదిరిందో వివరించారు.
"నలుగురు హీరోయిన్లు మామూలే.. రాఘవేంద్రరావు హీరో ఏమిటి అన్నది పాయింట్. ఆయన ఒక్కడు చేయడు కదా (నవ్వుతూ). నేను తీసిన ఒకే ఒక్క చిత్రం 'మిథునం'. దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. నేను ఇంకో సినిమా తీస్తున్నానంటే అది కూడా గొప్పగానే ఉండాలి కదా. అయితే దీనికి నా అసిస్టెంట్ మహర్షి కారణం. అతడు నా దగ్గరకు ఓ కథ తీసుకొచ్చి.. 'రాఘవేంద్రరావు గారికి చెప్పాలనుకుంటున్నా' అన్నాడు. నేనుండి.. 'ఏమయ్యా.. ఆయన సినీ ముని.. మాటైనా మాట్లాడడు.. ఏదో 'సౌందర్యలహరి' చేస్తున్నాడు గానీ, నటన అంటే అస్సలు ఒప్పుకోడు' అన్నా. అతడు ప్రయత్నిస్తా అని వెళ్తే రాఘవేంద్రరావు కథ వినలేదు. తిరిగొచ్చి నాకు కథ చెప్పాడు. బాగుంది! చాలా కొత్త కథ. 'తీయకపోయినా సరే ఒకసారి కథ వినండి గురువు గారు' అని రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి అడిగా. విన్నాక ఆయనకు నచ్చింది. ఎవరు డైరెక్టర్ అని మహర్షిని అడిగితే నా పేరు చెప్పాడట. ఆ సంగతి నాకు తెలియదు. వెంటనే ఆయన ఒప్పుకొన్నారు. అదే విషయం నాకు చెప్తే నేను డైరెక్ట్ చేయడం ఏంటయ్యా అన్నాను. లేదు సార్ మీరే చేయాలి అని పట్టుబట్టాడు. అలా కుదిరింది. అప్పటినుంచి సినిమా కార్యక్రమాలు జరుగుతున్నాయి."
- తనికెళ్ల భరణి, నటుడు
వంద కన్నా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన లివింగ్ లెజెండ్‌ను డైరెక్ట్ చేయడం అంటే అది పరమేశ్వరుడి కృపేనని చెప్పారు భరణి. నటన నచ్చకపోతే మరో టేక్ తీసుకునేందుకు కూడా సిద్ధమేనని సరదాగా అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: డబ్బింగ్ చెబుతున్న.. 'టక్ జగదీష్'