"సింహాన్ని ఫొటోలో చూసుంటావ్.. సినిమాలో చూసుంటావ్.. బోనులో చూసుంటావ్.. ఎప్పుడైనా అడవిలో గంభీరంగా నడవడం చూశావా.. జూలు దులిపి కసితో వేటాడటం చూశావా.. ఒక్క దెబ్బ కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్ రా.. చూస్తావా.. చూస్తావా" అంటూ పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రేక్షకులకు కిక్కు ఎక్కించిన హీరో సూర్య. తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ పెంచుకుని వైవిధ్య నటనతో మెప్పించి సూర్య పుట్టినరోజు నేడు. ఈ వైవిధ్య నటుడి సినిజీవితంపై ఓ లుక్కేద్దామా!
బ్యాక్‌గ్రౌండ్..
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి తమిళ నటుడు శివకుమార్. 1975 జులై 23న చెన్నైలో జన్మించాడు సూర్య. చెన్నై లయోల కళాశాలలో బికామ్ చేశాడు. అనంతరం సినిమాలపై ఆసక్తితో చిత్రసీమలో అడుగుపెట్టాడు. తండ్రి గుర్తింపు ఉన్న హీరో అయినా.. సొంతంగానే సినీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సోదరుడు కార్తీ కూడా తమిళ, తెలుగు భాషల్లో హీరోగా రాణిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూర్యకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
'నెరుక్కుర్ నేర్' అనే తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేశాడు సూర్య. మణిరత్నం ఈ సినిమాకు నిర్మాత. అప్పటికే శరవణన్ అనే వేరే హీరో ఉండడం వల్ల ఆయనే పేరును సూర్యగా మార్చాడు. ఇందులో విజయ్ ఇంకో హీరో. వాణిజ్య పరంగా ఈ సినిమా హిట్ కానప్పటకీ సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బ్రేక్ త్రూ...
అప్పటివరకూ అడపా దడపా సినిమాలు చేసిన సూర్య 'ఫ్రెండ్స్' చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలోనూ విజయ్‌తో కలిసి తెర పంచుకున్నాడు. అయితే హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 'నందా'. బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు సూర్య. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
స్టార్ హీరోగా గుర్తింపు..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని కాకా కాకా (తెలుగులో ఘర్షణ) చిత్రంతో సూర్య స్టార్ హీరో అయ్యాడు. అనంతరం శివపుత్రుడు, సుందరాంగుడులో విభిన్న పాత్రలతో మెప్పించాడు. 'సుందరాంగుడు'లో గూని ఉన్న వ్యక్తి పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. తర్వాత 'గజిని'లో ఆ యాక్టింగ్ శిఖరాన్ని తాకింది. 15 నిమిషాల్లో అన్నీ మర్చిపోయే మానసిక రోగిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనూ స్టార్ అయ్యాడు సూర్య.
విభిన్న చిత్రాలు.. వైవిధ్య పాత్రలు..
ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. ఆరు, దేవా, నువ్వు నేను ప్రేమ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. రెండు పాత్రల్లో నటించి ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. అనంతరం వీడొక్కడే, ఘటికుడు, యముడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. సింగం సిరీస్‌తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాంగ్రీ పోలీస్‌గా సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. సెవెన్త్ సెన్స్, బ్రదర్స్, 24 లాంటి వైవిధ్య చిత్రాలతో మెప్పిస్తూ.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వివాహం..
సూర్య తన సహనటి జ్యోతికను 2006లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి ఏడు చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
నిర్మాతగానూ..
ఓ పక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాత అవతారమెత్తాడు సూర్య. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రలో '36 వయదినిలే' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా మంచి హిట్ అయింది. పసంగ2 (మేము), 24, మాగలీర్ మట్టుమ్, కడై కుట్టి సింగమ్ లాంటి సినిమాలు నిర్మించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సామాజిక వేత్తగానూ..
'అగరమ్ ఫౌండేషన్' ఏర్పాటు చేసి ఆ సామాజిక సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సూర్య. చదువుకోలేని పేద పిల్లలకు ఈ సంస్థ ద్వారా ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. తండ్రి శివకుమార్ పేరు మీద 'శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్' ఏర్పాటు చేసి శ్రీలంకలోని తమిళులకు సాయం చేస్తున్నాడు. అంతేకాకుండా పలు సామాజిక ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నాడు.
అవార్డులు..
నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య ఇప్పటికే ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 5 రాష్ట్ర పురస్కారాలు అందుకున్నాడు. 5 సైమా అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కైవసం చేసుకున్నాడు సూర్య.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భవిష్యత్తు ప్రాజెక్టులు..
ఈ ఏడాది 'ఎన్జీకే'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. అయితే ఈ చిత్రం నిరాశపరిచింది. త్వరలో 'బందోబస్త్' సినిమాతో రాబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు దర్శకుడు కేవీ ఆనంద్. ఇంతకుముందే ఈ దర్శకుడితో వీడొక్కడే, బ్రదర్స్ సినిమాలతో కలిసి పనిచేశాడు. 'సురరై పొట్రూ' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను కాలితో తన్నిన జమున..తర్వాత ఏం జరిగింది?