ఎన్ని అవాంతరాలు ఎదురైనా తను అనుకున్నది చేసిచూపిన డేరింగ్ హీరో. తెలుగు సినిమాకు కొత్త రంగులు, కొత్త హంగులు.. కొత్త రుచులు.. కొత్త బాటలు చూపించిన డాషింగ్ హీరో ఎవరు అంటే... టక్కున చెప్పేది సూపర్‌స్టార్ కృష్ణ(superstar krishna) గురించే. ఓ దశాబ్దం పాటు అహోరాత్రులు, మూడు షిఫ్టులలో పనిచేసి సినిమాను పరిశ్రమగా మార్చారనడంలో అతిశయోక్తిలేదు. తెలుగు సినిమా సత్తా ఏమిటో, సాంకేతిక ఘనతలు ఏమిటో బాలీవుడ్‌కు(BOLLYWOOD) చాటగలిగారు. ఆయన సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో మెప్పించారు. చిత్రసీమలో కృష్ణ మంచివాడు, మనసున్నవాడు అంటూ మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు కురిపించడం విశేషం. సోమవారం(మే 31) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.
పాన్ ఆసియా సినిమాలు, ప్రపంచ స్థాయి సినిమాలు తెలుగు చలనచిత్రరంగానికి కొత్తేమీ కాదు. హీరో కృష్ణ ఆ ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఆధునికతకు ఆద్యుడు. మన చిత్రసీమకు తొలి సినిమా స్కోప్ , తొలి 70 ఎంఎం, మొట్టమొదటి డీటీఎస్(DTS), తొలి జేమ్స్ బాండ్(james bond), తొలి కౌబోయి(cowboy) చిత్రాన్ని తీసుకొచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది.
కృష్ణ సినీ కెరీర్
హీరో కృష్ణ.. సినీ కెరీర్లో 111 మంది దర్శకులతో సినిమాలు చేశారు. 76 మంది హీరోయిన్లు ఆయన సరసన నటించారు. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' నుంచి 2013లో వచ్చిన 'సుకుమారుడు' వరకు 31 సినిమాల్లో అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు. 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. 'సింహాసనం' చిత్రంలో దర్శకుడుగా ఉంటూనే ద్విపాత్రాభియనం చేశారు. 2015లో శ్రీశ్రీ సినిమా తర్వాత నటించలేదు. మనవడు గౌతమ్ కృష్ణతో కలసి నటించాలని ఉందని గతంలో తన మనోగతాన్ని వెల్లడించారు.
మల్టీస్టారర్ చిత్రాలకు పెట్టింది పేరు.. కృష్ణ!
మల్టీస్టారర్ మూవీస్(multistarrer), నటీనటుల మధ్య ఒక ఆరోగ్యప్రదమైన సంప్రదాయానికి శ్రీకారం. దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే బహుళ కథానాయకుల చిత్రాలకు ఎక్కువ చొరవ తీసుకున్న నటుడు సూపర్‌స్టార్ కృష్ణనే అని చెప్పవచ్చు. హీరో కృష్ణనే ఒక మల్టీస్టార్. కౌబోయ్, లవ్ బోయ్, యాక్షన్, వెస్ట్రన్ క్లాసిక్, పౌరాణికం, డ్రామా, సాంఘిక, చారిత్రక, జానపద సినిమాలలో నటించారు. కృష్ణ అనేక మల్టీస్టారర్ చిత్రాలకూ పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన నటించినన్ని మల్టీస్టారర్లు మరెవరూ చేయలేదు. వాటిలో ఎన్టీఆర్‌తో 1974లో చేసిన 'దేవుడు చేసిన మనుషులు' సంచలన విజయం సాధించింది. శోభన్ బాబుతో గంగ-మంగ, మండే గుండెలు, ఇద్దరు దొంగలు ముఖ్యమైనవి. ఎన్టీఆర్‌తో వయ్యారి భామలు-వగలమారి భర్తలు, కృష్టంరాజుతో 'విశ్వనాథనాయకుడు'లో నటించారు.
ఇలా టాలీవుడ్లో ఎన్నో ఘనతలు సాధించి, వర్ధమాన కథానాయకులకు స్ఫూర్తిగా నిలిచిన కృష్ట.. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని 'ఈటీవీ భారత్' ఆకాంక్షిస్తోంది.