నటనతోనే కాకుండా.. నిరాడంబరత, నిజాయితీతో అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడినీ ఆకట్టుకున్న హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్. తాజాగా సినీ పరిశ్రమలో తన గురువుగా భావించే దర్శకుడు కలైజ్ఞానంకు ఓ ఇల్లును బహుమతిగా ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నాడు.
ప్రముఖ దర్శకుడు కలైజ్ఞానం సినీ పరిశ్రమకు చేసిన సేవను స్మరిస్తూ ఇటీవల ఓ అభినందన సభ ఏర్పాటు చేశారు కోలీవుడ్ ప్రముఖులు. ఆ కార్యక్రమంలోనే రజనీకాంత్ తన గురువుకు ఓ ఇల్లును బహుకరిస్తానని ప్రకటించాడు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నైలోని విరుగాంబాక్కమ్లో 3 పడక గదుల గృహాన్ని కొని ఆయనకు ఇచ్చాడు. దీని విలువ కోటి అని సమాచారం.
ఆగస్టు 14న జరిగిన అభినందన సభలో... కలైజ్ఞానంకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని, అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని చర్చ జరిగింది. ఆయనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు సినీ ప్రముఖులు. వెంటనే స్పందించిన రజినీ.. తనే ఇల్లు కట్టించి ఇస్తానని ప్రకటించాడు.
రజనీ సోలో హీరోగా నటించిన తొలి సినిమా ‘భైరవి’ (1978). ఈ సినిమాను కలైజ్ఞానం నిర్మించారు. కెరీర్ ఆరంభంలో సినిమా అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కలైజ్ఞానం తనను ఆదుకున్నడని చెప్పాడు సూపర్‌స్టార్.
ఇదీ చదవండి: కర్నూలు బురుజు ముందు మహేశ్ గొడ్డలివేట...!