హైదరాబాద్‌లో 1975 ఫిబ్రవరి 9న సుమంత్ జన్మించాడు. సురేంద్ర యార్లగడ్డ, దివంగత సత్యవతి అక్కినేని తల్లిదండ్రులు. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమార్తె సత్యవతి. సుమంత్ తండ్రి యార్లగడ్డ సురేంద్ర అప్పట్లో పేరు మోసిన సినీ నిర్మాత. సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌కి సుప్రియ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తోంది. ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని... సుమంత్‌కు మావయ్య అవుతారు. నాగ చైతన్య, అఖిల్ అక్కినేని, సుశాంత్... సుమంత్‌కి కజిన్స్. 2004 ఆగస్టులో, ఒకప్పటి నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకొన్నారు సుమంత్. 2006లో విడాకులు తీసుకొన్నారు.
దత్తత తీసుకున్న అక్కినేని
అప్పట్లో ఏడాదికి ఆరు, ఏడు సినిమాలు చేస్తూ ఉండడం వల్ల కుమారులతో సమయాన్ని కేటాయించలేకపోయేవారు నాగేశ్వరరావు. ఎప్పుడూ అవుట్ డోర్ షూటింగ్స్‌తో బిజీగా గడిపేవారు. పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడంపై బాధపడుతూ ఉండేవారు. 'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో ఒకసారి నాగేశ్వరరావుకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో, ఒక సంవత్సరం పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సుమంత్ జన్మించాడు. నాగేశ్వరరావు రెస్ట్ టైంలో సుమంత్ పాకడం, ఆయన పక్కన పడుకోవడం వంటి వాటితో సుమంత్, నాగేశ్వరావు బాగా దగ్గరయ్యారు. ఎలాగూ సినిమాలు చేస్తూ తాను తండ్రి మమకారాన్ని పొందని కారణంగా... సుమంత్‌ని పెంచి ఆ విధంగానైనా ఆ అనుభూతి అందుకోవాలని భావించారు నాగేశ్వరరావు. ఆ విధంగా సుమంత్‌ని అక్కినేని నాగేశ్వరరావు, ఆయన భార్య అన్నపూర్ణ దత్తత తీసుకొన్నారు. అంతటితో సుమంత్ ఈ దేశంలోనే హైదరాబాద్‌లో పెరిగాడు.
తాతయ్యతో షూటింగ్‌లకు
సుమంత్ చిన్నప్పుడు తాతయ్యతో షూటింగ్‌లకు వెళ్లేవాడు. అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడట. సుమంత్ తన తాతయ్య నాగేశ్వరరావుని బాగా ఇమిటేట్ చేసేవాడు. 'ప్రేమాభిషేకం' సినిమాలో 'వందనం' పాటకు గ్లాసు పట్టుకొని మరీ తన తాతయ్యను ఇమిటేట్ చేసేవాడినని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు.
పక్కా హైదరాబాదీ
సుమంత్ పక్కా హైదరాబాదీ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు సుమంత్. సుమంత్ చదువుకునేటప్పుడు మూడు, నాలుగు ఫారిన్ కార్లు ఇంట్లో ఉండేవి. అయితే, అప్పుడే విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వకూడదన్న నాగేశ్వరరావు పబ్లిక్ బస్సు ద్వారా సుమంత్‌ని స్కూల్‌కి పంపించేవారట. అలా దాదాపు పది సంవత్సరాల పాటు బస్సులోనే స్కూల్‌కి వెళ్లేవాడు సుమంత్. రోడ్డు పక్క పానీపూరి తినడం, ఆటో ఎక్కి చార్మినార్‌కి వెళ్లడం వంటివి సుమంత్‌కి చాలా ఇష్టం.
వివాహం మీద ఆసక్తి లేదు
కీర్తిరెడ్డితో వివాహం బంధం ముగిసిన తరువాత సుమంత్ తిరిగి వివాహం చేసుకోలేదు. పెళ్లి మీద ఆసక్తి లేకపోవడమే అందుకు కారణమని ఒకసారి మీడియా ముందు చెప్పాడు సుమంత్. తనకు వివాహం సరియైనది కాదని ఆయన అభిప్రాయం.
చదువు
మిచిగాన్‌లో ఇంజనీరింగ్ కోర్స్‌లో చేరిన సుమంత్ రెండేళ్లకే ఆ విద్యను వదిలి కొలంబియా కాలేజ్‌లో మారి అక్కడి ఫిల్మ్ స్టడీస్‌తో బి.ఎ.లో చేరాడు. ఫిల్మ్ స్కూల్లో మాత్రమే తాను నిజంగా ఆనందించానని, చదువులో అభివృద్ధి చెందానని చెప్పాడు.
మొదటి సినిమాకు 'టైటానిక్' స్ఫూర్తి
సుమంత్ మొదటి సినిమా 'ప్రేమకథ'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. 1999 ఏప్రిల్ 15న ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా గురించి సుమంత్... 'టైటానిక్' స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినట్లు చెప్పాడు. ఇందులో సుమంత్ నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. సినిమా ఎన్నో విభాగాల్లో నంది పురస్కారాలను కూడా అందుకొంది. ఆ తరువాత సుమంత్ నటించిన సినిమా 'యువకుడు'. ఇందులో భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించింది. భూమికకు తెలుగులో ఇదే మొదటి సినిమా.
కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ప్రశంసలను అందుకోగలిగింది. మూడవ సినిమా 'పెళ్లి సంబంధం'లో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో నటించే అవకాశం దక్కించుకోగలిగాడు సుమంత్. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావు. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. మావయ్య నాగార్జునతో సుమంత్ చేసిన 'స్నేహమంటే ఇదేరా' సినిమా కూడా బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడడం అక్కినేని అభిమానులకు ఇబ్బంది కల్గించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాక్సాఫీసు విజయం
2003లో 'సత్యం' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు సుమంత్. జెనీలియా డిసౌజాకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. అక్కినేని నాగార్జున నిర్మించిన 'సత్యం' సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తరువాత 'గౌరీ' సినిమా ద్వారా మరొక హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు సుమంత్. ఈ సినిమా ద్వారా యాక్షన్ ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు.
గోదావరి కెరీర్ లోనే బెస్ట్ మూవీ
'ధన 51' చిత్రం పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. సుమంత్... ఆ తరువాత అనుష్కశెట్టితో 'మహానంది'లో నటించాడు. 2006లో శేఖర్ కమ్ముల రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించిన 'గోదావరి' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుమంత్. ఆయన కెరీర్‌లో ఎక్కువ ప్రశంసలు పొందిన సినిమాగా ఇదే. అత్యథిక రివ్యూలు, బాక్సాఫీసు విజయం అందుకోవడమే కాకుండా... ఎన్నో నంది, ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకొంది ఈ చిత్రం. 'గోదావరి' సినిమా కారణంగా సుమంత్‌కు దేశవిదేశాల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
గోదావరితో అక్కినేని కుటుంబ బంధం
గోదావరి నది ఒడ్డునే 'గోదావరి' సినిమా షూటింగ్ జరిగింది. అక్కడే నాగేశ్వరరావు, సావిత్రి, జమున ముఖ్య పాత్రల్లో నటించిన 'మూగమనసులు' సినిమా షూటింగ్ కూడా జరగడం విశేషం. అదే విధంగా నాగార్జున, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించిన 'జానకీ రాముడు' సినిమా షూటింగ్ కూడా గోదావరి నది ఒడ్డునే జరిగింది. గోదావరి నది దగ్గర షూటింగ్ జరుపుకున్న ఈ మూడు అక్కినేని సినిమాలు కూడా విజయవంతమవడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2006లో సుమంత్ 'చిన్నోడు' అనే సినిమాలో నటించాడు. ఇది యావరేజ్‌గా ఆడింది. 2007లో 'మధుమాసం', 'క్లాస్ మేట్స్' అనే రెండు సినిమాలలో నటించాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'మధుమాసం' సినిమాలో స్నేహ హీరోయిన్‌గా నటించగా... రామానాయుడు నిర్మించారు. చంద్రసిద్దార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అయింది. అయితే, 'క్లాస్ మేట్స్' మాత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. కానీ, ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. 2008లో 'పౌరుడు' సినిమాలో నటించాడు సుమంత్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మధ్యస్తంగా విజయం సాధించింది. యాక్షన్ సన్నివేశాల పరంగా ఈ సినిమా ఎన్నో ప్రశంసలను దక్కించుకోగలిగింది. ఆ తరువాత 2009లో 'బోణి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సుమంత్.
విరామం తర్వాత 'గోల్కొండ హై స్కూల్'
2010లో దాదాపు ఏడాది పాటు సినిమాల నుంచి విరామం తీసుకొన్న సుమంత్ 'గోల్కొండ హై స్కూల్' అనే ప్రయోగాత్మకమైన సినిమాలో నటించాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 'ద మెన్ వితిన్' అనే ఆంగ్ల నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నవలని మాజీ క్రికెటర్ హరిమోహన్ రాశారు. తెలుగులో 'గోల్కొండ హై స్కూల్' ఒక మంచి స్పోర్ట్స్ సినిమాగా గుర్తింపు పొందింది. 2011 జనవరి 15న విడుదల అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొంది. అలాగే కమర్షియల్‌గా కూడా విజయాన్ని చూసింది. క్రికెట్ కోచ్‌గా సుమంత్ బాగా నటించాడంటూ మంచి ప్రశంసలు లభించాయి. సుమంత్ కెరీర్‌లో ఈ సినిమాలోని పాత్ర ఎంతో మంచి పాత్ర అన్న ప్రశంసలూ వచ్చాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ తరువాతి సుమంత్ సినిమా రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకున్న 'రాజ్'. 2011 మార్చిలో ఇది రిలీజ్ అయింది. ఈ చిత్రం తరువాత 'దగ్గరగా దూరంగా' చిత్రంలో నటించాడు. రవికుమార్ చావలి దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. 2011 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బిలో యావేరేజ్ బిజినెస్ చేసింది. 2013లో, మరోసారి చంద్రసిద్దార్థ్ తో కలిసి 'ఏమో గుర్రం ఎగరవచ్చు' సినిమాకు వర్క్ చేశాడు సుమంత్. 2014 జనవరి 25న విడుదల అయింది ఈ రొమాంటిక్ కామెడీ సినిమా. అయితే కామెడీ జోనర్లో సుమంత్ నటించిన కారణంగా పాజిటివ్ రివ్యూలు మాత్రం వచ్చాయి. ఆ తరువాత మరొక కామెడీ సినిమా 'నరుడా డోనరుడా' చిత్రంలో నటించాడు సుమంత్. హిందీ సినిమా 'విక్కీ డోనర్'కి ఇది రీమేక్. 2016 నవంబర్‌లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయింది.
'మళ్ళీ రావా'తో మరో విజయం
కొన్ని వరుస అపజయాల తరువాత, రొమాంటిక్ డ్రామా 'మళ్ళీ రావా' చిత్రంలో నటించాడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017 డిసెంబర్ 8న విడుదలై మంచి విజయం సాధించుకుంది. తెలుగు ఛాంబర్ అఫ్ ఫిల్మ్ కామర్స్ నుంచి ఉత్తమ నటుడి పురస్కారం కూడా సుమంత్‌ని వరించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో కూడా ఈ సినిమా పురస్కారాలు అందుకోగలిగింది. ఆ తరువాత మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 'సుబ్రమణ్యపురం' సినిమాలో నటించాడు సుమంత్. తరువాత సుమంత్ నటించిన 'ఇదం జగత్' అభిమానుల్ని నిరాశపరిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్‌గా
నందమూరి తారక రామారావు బయోపిక్‌లో 'ఎన్టీఆర్: కథానాయకుడు'లో తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించాడు సుమంత్. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ పోషించిన పాత్రకు అన్ని వైపులా నుంచి ప్రశంసలు లభించాయి. సుమంత్ ప్రస్తుతం థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న 'కపటధారి' సినిమాలో నటిస్తున్నాడు. కన్నడంలో విజయవంతమైన ఓ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది. అలాగే నూతన దర్శకుడు విను యజ్ఞ దర్శకత్వంలో సుమంత్ ఓ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో బలమైన, ప్రాధాన్యమున్న నెగటివ్ రోల్స్‌లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని సుమంత్ చెపినట్టు సమాచారం.
'దేశముదురు'ని వద్దనుకున్న సుమంత్
పూరి జగన్నాథ్, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'దేశముదురు'. ఈ చిత్ర కథ మొదట సుమంత్ దగ్గరకే వెళ్లిందట. అయితే, ఇందులో నటించడానికి సుమంత్ ఆసక్తి కనబర్చలేదు. దాంతో, ఆ అవకాశం బన్నీకి వెళ్ళింది.
- పి.వి.డి.ఎస్.ప్రకాష్
ఇదీ చూడండి : పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన కల్కి కొచ్చిన్!