యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో నటి రియా చక్రవర్తి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. మాదకద్రవ్యాల కేసుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందుకు ఆమె హాజరైంది. రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఆమెకు నోటీసులు పంపారు. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతోపాటు షోవిక్ చక్రవర్తి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే ఉండేలా శనివారం కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణలో భాగంగా షోవిక్ డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురి పేర్లు వెల్లడించినట్లు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.
షోవిక్ అరెస్టును అతడి లాయర్ సతీష్ మనేషిండే ఖండించారు. అతడు మాదకద్రవ్యాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ అరెస్టుపై అతడి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి సైతం స్పందించారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
'భారత్‌కు శుభాకాంక్షలు. ఇప్పుడు నా కుమారుడిని అరెస్టు చేశారు. తర్వాత నా కుమార్తెను అరెస్టు చేయనున్నారు. అనంతరం ఎవరిని అదుపులోకి తీసుకుంటారో తెలియదు. ఓ మధ్యతరగతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్, జూన్ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నటి రియా చక్రవర్తి సుశాంత్‌ను మనోవేదనకు గురిచేసిందని, ఆమెతోపాటు మరికొందరు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని నటుడి తండ్రి బిహార్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. రియా చక్రవర్తి, ఆమె తండ్రి, ఆమె సోదరుడిని సీబీఐ విచారించింది. ఈ విచారణలో భాగంగానే మాదకద్రవ్యాల గుట్టు బయటపడింది.