అగ్రికల్చర్లో కల్చర్ తగ్గడం వల్లే యువత వ్యవసాయం వైపు రావడం లేదని అన్నారు మంత్రి కేటీఆర్. భూమిని నమ్ముకున్నవాడి కంటే అమ్ముకున్నవాడే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని చెప్పిన ఆయన.. ఆ పరిస్థితి మారాలని వెల్లడించారు. 'శ్రీకారం' సినిమా ముందస్తు విడుదల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నటుడు రావురమేష్ నటనకు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. "నేను చాలా సినిమాలు చూస్తాను. బాగుంటే బాగుందని చెబుతాను, బాగాలేకపోతే మోహమాటం లేకుండా బాగోలేదని అంటాను" అని అన్నారు.
"చాలా ఈవెంట్స్‌కు వెళ్తుంటాం. కానీ సంతృప్తినిచ్చిన ఈవెంట్ శ్రీకారం. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. వ్యయం పెరిగిపోయి రైతుకు సాయం అందడం లేదు. అగ్రికల్చర్లో కల్చర్ తగ్గడం వల్లే యువత వ్యవసాయం వైపు రావడం లేదు. రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో తెలంగాణలో కనిపిస్తుంది. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. వారికి పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. అప్పులపాలై రైతులు నష్టపోవద్దని రైతుబంధును తీసుకొచ్చారు. లాక్డౌన్లో 132 కోట్ల మందికి అన్నం పెట్టింది వారే. కానీ భూమిని నమ్ముకున్నవాడి కంటే అమ్ముకున్నవాడే ఎక్కువ సంతోషంగా ఉంటున్నాడు. ఆ పరిస్థితి మారాలి."
-కేటీఆర్
'శ్రీకారం' సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చేందుకు కృషిచేస్తానని అన్నారు కేటీఆర్. 28 ఏళ్లలోనే ఈ చిత్ర దర్శకుడు ఇంత మంచి సినిమా చేశాడంటే చాలా గర్వంగా ఉందని చెప్పారు. రైతులకు తప్పకుండా మంచి భవిష్యత్ ఉందని యువత నిరూపించాలని వెల్లడించారు. శివరాత్రి రోజు ఈ సినిమా అన్ని షోలు చూసి సినీ పరిశ్రమకు అండగా ఉండాలి పిలుపునిచ్చారు.