Sonu sood: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి నోటీసులు పంపింది. ఆరు అంతస్థుల బిల్డింగ్‌ను నివాస సముదాయంగా ఇంకా మార్చలేదని నోటీసులో పేర్కొంది. గత నెల 15న ఈ నోటీసులు పంపిన కార్పొరేషన్.. దీనిపై స్పందించి, తక్షణమే వివరణ ఇవ్వాలని సోనూకు ఆదేశించింది.
ఏం జరిగిందంటే?
ఈ ఏడాది ప్రారంభంలో సోనూసూద్‌కు చెందిన భవంతిపై మానవ హక్కుల కార్యకర్త ఒకరు, బీఎంసీకి ఫిర్యాదు చేశారు. నివాస సముదాయాన్ని సోనూసూద్.. హోటల్‌గా నడుపుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బిల్డింగ్‌ను కూల్చి వేయాలని కోరారు. అయితే సోనూసూద్-బీఎంసీ మధ్య జరిగిన ఈ విషయం.. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
భవంతిని హోటల్‌గా మార్చడం సరికాదని సోసూసూద్కు హైకోర్టు తెలిపింది. దీంతో అధికారులు చెప్పినట్లు చేస్తానని సోనూ అన్నారు. కానీ అది ఇప్పటికీ జరగలేదని బీఎంసీ మరోసారి సోనూసూద్‌కు నోటీసులు పంపింది.
"ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారం 1 నుంచి 6 అంతస్థుల వరకు నివాస సముదాయంగానే ఉపయోగిస్తామని గతంలో మీరు మాకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. కానీ అక్టోబరు 20న మేం బిల్డింగ్ చెక్ చేశాం. లేఖలో మీరు చెప్పినట్లు అక్కడ పనులు జరగడం లేదు. మాకు అక్కడ ఎలాంటి మార్పులు కనిపించలేదు" అని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, తన నోటీసులో పేర్కొంది.
ఇవీ చదవండి: