మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల (MAA elections) వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈసారి ఎన్నికలు 'మా' భవనం చుట్టూ తిరుగుతుండటం వల్ల ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు వ్యాఖ్యలు, ప్రతిగా నాగబాబు స్పందించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా 'మా' భవనం అమ్మేసిన(MAA building sold) విషయమై నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొన్నది బంగ్లా కాదని, కేవలం ఫ్లాట్ మాత్రమేనని వివరణ ఇచ్చారు.
తాజాగా ఓ మీడియా ఛానల్‌తో శివాజీ రాజా మాట్లాడుతూ.. "బంగ్లా కొని అమ్మేశారని అందరూ మాట్లాడుతున్నారు. కానీ, అది నిజం కాదు. అది కేవలం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్. దానిలోనే దర్శకుల అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఆ రెండు అసోసియేషన్‌లు ఉన్నాయని, నాగబాబు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పైన ప్లాట్‌ను కొని ఉండవచ్చు. అయితే, దాన్నే అమ్మే విషయంలో నేను, సెక్రటరీ నరేశ్‌లు పారదర్శకంగా వ్యవహరించాం. అద్దెలు సరిగా రాకపోవడం, ఆ భవనం కిందే డ్రైనేజీ ఉండటం కారణంగా అమ్మేద్దామనుకున్నాం. అందరం మాట్లాడుకుని ఈసీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నాం. అందుకు కమిటీ కూడా ఏర్పాటు చేశాం. పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరూ ముందుకు రాకపోతే, మాకు డైరీలు వేసిన మురళీ అనే వ్యక్తికి దాన్ని అమ్మాం. ఎవరైనా బిల్డింగ్ అమ్మకం గురించి మాట్లాడాలనుకుంటే ముందు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడ నిజాలు తెలుసుకోవాలి. అప్పుడు మాట్లాడితే నేను సంతోషిస్తాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఎవరైనా వచ్చి నన్ను అడగవచ్చు. మా ఎన్నికల ముంగిట ఇలాంటి విషయాల మీద మాట్లాడటం ఎవరికైనా అంత గౌరవంగా ఉండదు" అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి: