దాదాపు నాలుగేళ్ల క్రితం తాను పెట్టిన ఓ వైరల్ ట్వీట్ గురించి ప్రముఖ నటి శ్రుతిహాసన్ తాజాగా స్పందించింది తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. తాను ఇప్పట్లో కన్నడ సినిమా చేసే అవకాశాలు లేవంటూ 2017లో శ్రుతి పెట్టిన ట్వీట్ అప్పట్లో వైరల్‌గా మారింది.
కన్నడ చిత్రపరిశ్రమ పట్ల శ్రుతికి గౌరవం లేదని, అందుకే కన్నడ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారని అందరూ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె కన్నడ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్'లో నటించడం పట్ల పలువురు నెటిజన్లు.. ఆనాటి ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వీటిపై శ్రుతిహాసన్ స్పందించింది.
"కన్నడ చిత్రపరిశ్రమలో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. 'సలార్' బృందం ఎంతో ప్రత్యేకమైనది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 'సలార్' విషయానికి వచ్చేసరికి కథ, పాత్ర నాకెంతో నచ్చింది. అలాగే ఈ చిత్రబృందం నచ్చడం వల్ల వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశా. అన్ని భాషా చిత్రాల్లో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. 2017లో నేను చేసిన ఓ ట్వీట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ, దర్శక నిర్మాతలు, నటీనటుల పట్ల నాకు గౌరవం ఉంది."
-శ్రుతి హాసన్, నటి
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేసిన శ్రుతి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్'లో నటిస్తున్నారు. ఇటీవల రవితేజ సరసన ఆమె హీరోయిన్గా నటించిన 'క్రాక్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.