బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠాతో ఆమె ప్రేమలో ఉన్నారని బీటౌన్‌లో టాక్. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సదరు వార్తలపై తాజాగా శ్రద్ధాకపూర్ తండ్రి శక్తికపూర్ స్పందించారు. రోహన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు శ్రద్ధా ఇప్పటి వరకూ తనతో చెప్పలేదని.. పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అభ్యంతరం చెప్పనని అన్నారు.
"నా కుమార్తె శ్రద్ధాకపూర్ వివాహం గురించి ఆన్‌లైన్‌లో ఎలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయో నాకు తెలీదు. కానీ, నా కుమార్తె తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తాను. అలాగే పెళ్లి విషయంలో కూడా ఆమె అభిప్రాయాన్ని నేను అంగీకరిస్తాను. రోహన్ శ్రేష్ఠా లేదా మరెవరినైనా సరే.. పెళ్లి చేసుకుంటానని ఆమె చెబితే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. రోహన్ చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి అతను మా ఇంటికి వస్తుండేవాడు. ఇప్పటికీ వస్తున్నాడు. మాతో చక్కగా కలిసిపోతాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇప్పటి వరకూ శ్రద్ధా నాతో చెప్పలేదు. నా దృష్టిలో వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు మాత్రమే. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారో లేదో నాకింకా తెలీదు" అని శక్తి కపూర్ వివరించారు.
ఇదీ చూడండి: 'విరాటపర్వం', 'ఎఫ్ 3' రిలీజ్ డేట్స్ ఫిక్స్