ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమలో జెండా పాతిన అనేక మంది కొత్త దర్శక నిర్మాతలకు థ్రిల్లర్ చిత్రాలే పూల బాటలు పరిచాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో పరిచయమైన స్వరూప్.ఆర్.ఎస్.జె, 'అ!'తో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ, 'గూఢచారి'తో మెప్పించిన శశికిరణ్ తిక్క, 'హిట్'తో తొలి ప్రయత్నంలోనే ఆకర్షించిన శైలేష్ కొలను.. ఇలా చెప్పుకుంటూ పోతే థ్రిల్లర్ బాటలో నడిచొచ్చి హిట్ కొట్టిన కొత్త దర్శకులు అనేక మంది. ఇప్పుడు వీళ్లంతా మరోసారి సినీ ప్రియుల్ని థ్రిల్ చేసేందుకు తమ హిట్ చిత్రాలకు సీక్వెల్స్‌ను సిద్ధం చేస్తున్నారు.
మరో రాక్షసుడు..
కథానాయకుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు మంచి విజయాన్ని అందించిన చిత్రం 'రాక్షసుడు'. తమిళ చిత్రం 'రాచ్చసన్'కు తెలుగు రీమేక్‌గా..సైకో థ్రిల్లర్‌గా దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో దీనికి కొనసాగింపు చిత్రం రానప్పటికీ.. తెలుగులో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది చిత్ర బృందం.
చిత్ర దర్శకుడు మరో 'రాక్షసుడు' కోసం కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితియార్థం నాటికి సినిమాను పట్టాలెక్కించనున్నారని సమాచారం. తొలి భాగానికి పనిచేసిన బృందంతోనే సీక్వెల్‌నూ తెరకెక్కించనున్నారు.
'హిట్' ట్రాక్‌లోకి కొత్త కేసు..
ఓ వైవిధ్యభరిత క్రైం థ్రిల్లర్ కథాంశంతో 'హిట్' చిత్రాన్ని తెరకెక్కించి.. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శైలేష్ కొలను. విష్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన ఈ చిత్రం.. మంచి ఆదరణను దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా 'హిట్ 2'ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం.
తొలి చిత్రంలో ఓ యువతి మిస్సింగ్ కేసు చుట్టూ కథ నడవగా..ఈ రెండో భాగంలో మరో ఆసక్తికర కేసును కథాంశంగా చూపించబోతున్నారు. అలాగే ఫస్ట్ పార్ట్‌లో అసంపూర్ణంగా వదిలేసిన విష్వక్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను 'హిట్ 2'లో చూపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విష్వక్ సేన్ నటిస్తోన్న 'పాగల్' చిత్రం పూర్తి కాగానే 'హిట్ 2' సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
మరోమారు 'అ!'అనిపించేందుకు..
'అ!' చిత్రంతో తొలి అడుగులోనే జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఓ విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. సినీప్రియుల్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇప్పుడిదే తరహాలో మరోసారి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేందుకు 'అ 2'తో రాబోతున్నారు ప్రశాంత్.
ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ సీక్వెల్ కోసం నిర్మాతను వెతికే పనిలో ఉన్నారు ఈ యువ దర్శకుడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో కరోనా వైరస్ నేపథ్యంతో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయిన వెంటనే 'అ 2' సెట్స్‌పైకి వెళ్లనుంది.
కత్తి మీద సామే..
నిజానికి కొత్త దర్శకులు, నిర్మాతలు థ్రిల్లర్ కథలవైపు ప్రత్యేకంగా దృష్టి సారించడానికి రెండు కారణాలున్నాయి. ఈ జోనర్‌కంటూ ఓ లక్షిత ప్రేక్షక వర్గం ఉండటం.. పరిమితమైన బడ్జెట్‌తో తక్కువ కాలంలో తెరకెక్కించగలగడం వీటికున్న ప్రత్యేకతలు.
దీనికి తోడు సీక్వెల్ చిత్రాల్ని తెరకెక్కించడానికి థ్రిల్లర్ జోనర్ బెస్ట్ ఆఫ్షన్. కనీసం అనుకున్న ప్రేక్షకులకు చేరువైనా పెట్టిన పెట్టుబడి అవలీలగా రాబట్టెయ్యొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు తొందరగా ఈ జోనర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాదు ఇప్పుడున్న తరుణంలో ఓటీటీ వేదికలకూ థ్రిల్లర్‌లు మంచి ఆఫ్షన్‌గా మారాయి. అయితే ఎంత విజయవంతమైన థ్రిల్లర్‌కి సీక్వెల్ తీసుకొస్తున్నా.. కథలో దమ్ము లేకుంటే బోర్లా పడాల్సిందే. అందులో ఈజోనర్‌లో సీక్వెల్స్ తీసుకొచ్చేటప్పుడు చిత్ర కథ, కథనాల విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.
తొలి భాగంను మించిన థ్రిల్లింగ్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రేక్షకులకు చూపించబోయే ట్విస్ట్‌లు మరింత ఆసక్తిరేకెత్తించే విధంగా ఉండాలి. లేదంటే వాళ్లను మెప్పించడం కష్టం. అంతేకాదు థ్రిల్లర్ జోనర్ చిత్ర విజయాలన్నీ కథను ఎత్తుకున్న విధానం.. కథలో వేసిన చిక్కు ముడులు.. వాటిని ఒకొక్కటిగా ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా విప్పి చూపించగలగడంపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోని.. ప్రేక్షకుల అంచనాల్ని అందుకునే రీతిలో సీక్వెల్స్‌ను ముస్తాబు చెయ్యడం దర్శకులకు కత్తి మీద సామే.
త్రినేత్ర 116 మళ్లీ వస్తున్నాడు..
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు'.. ఇలా ఇటీవల కాలంలో వరుస థ్రిల్లర్‌లతో మెప్పించి, సినీప్రియుల మదిలో థ్రిల్లర్ స్టార్‌గా నిలిచారు కథానాయకుడు అడివి శేష్. ముఖ్యంగా 'గూఢచారి' చిత్రంతో ఆయన కథానాయకుడిగానే కాక రచయితగానూ మెప్పించారు. ఇప్పుడీ నయా గూఢచారి మరోసారి ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
'గూఢచారి 2'తో వెండితెరపై సరికొత్త సాహసాలు చూపించబోతున్నారు. ఇందులోనూ ఆయన త్రినేత్ర ఏజెంట్ 116గానే దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు శేష్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న 'మేజర్' పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని లక్ష్యంతో ఉన్నారు.
తొలి 'గూఢచారి'తో శశికిరణ్ తిక్క అనే నూతన దర్శకుడ్ని తెరకు పరిచయం చెయ్యగా.. ఈ సీక్వెల్‌తో రాహుల్ పాకాల అనే మరో కొత్త దర్శకుణ్ని తీసుకురాబోతుంది చిత్ర బృందం. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ కొనసాగనుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఏజెంట్ ఆత్రేయ.. తెరపైకి మళ్లీ మళ్లీ
"షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. ఈ ఏజెంట్ ఆత్రేయ ఒరిజినల్" అంటూ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో డిటెక్టివ్‌గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు హీరో నవీన్ పొలిశెట్టి. నూతన దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో డిటెక్టివ్ చిత్రాలకు కొత్త ఊపిరి పోసింది.
ఇప్పుడీ చిత్రం నుంచి మరో రెండు కొనసాగింపు కథలు రాబోతున్నాయి. దీంట్లో మరిన్ని కొత్త కేసులను ఛేదించేందుకు ఏజెంట్ ఆత్రేయగా రంగంలోకి దిగబోతున్నారు నవీన్. రెండో సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లనుంది.