సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. మూడు షిఫ్టులూ పని చేసి ఇబ్బడిముబ్బడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆశ అంతకన్నా లేదు. బ్యాంకు బాలెన్స్ పెంచుకుని సంతోషపడాలనే తాపత్రయమూ లేదు. ఎంచక్కా బ్యాంకులో ఉద్యోగం... ముఖానికి రంగు వేసుకోవాలనే తపన తీర్చేందుకు అందుబాటులో రంగస్థలం. సుప్రసిద్ధ రచయితలు రాసిన నాటకాలను వేస్తూ సంబరపడ్డమే ఆయనకు తెలుసు.
అలాంటిది... ఆయన్ని తెలుగు సినిమాయే పిలిచింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. కొన్ని దశాబ్దాల పాటు విభిన్న పాత్రలు పోషించే ఆకాశమంత అవకాశాన్ని ఇచ్చింది. విలన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలు చేస్తూ తన ముద్రను సుస్థిరం చేసుకున్నారు. మొదట్లో రచయితలు ముందుగా రాసిన పాత్రలు ఆయన చెంతకు చేరేవి. క్రమేణా ఆయన కోసం మాత్రమే రచయితలు సరికొత్త పాత్రలు రాసే స్థాయికి ఆయన చేరుకున్నారు. కొన్ని పాత్రలైతే... ఆయన మాత్రమే వేయాలని తన కాల్షీట్స్ కోసం ఎదురు చూసిన చరిత్ర ఉంది. ఓ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు హీరో హీరోయిన్లతో పాటు... 'అబ్బా! ఏం చేసాడురా. ఇరగదీసాడు...' అంటూ ప్రశంసలతో ముంచెత్తడం ఆయనకు అనుభవైకవేద్యమే. అంతలా...అటు ప్రేక్షకులను, ఇటు ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆ ఆర్టిస్ట్...నటనకు పెట్టని కోట...కోట శ్రీనివాసరావు.
కోట చిత్రరంగ ప్రవేశం
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో 750కి పైగా చిత్రాలు చేసిన కోట శ్రీనివాసరావు 1947 జులై 10న ఆంధ్రప్రదేశ్ కంకిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి కోట సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో ఉండేవారు. ఆయన కోట శ్రీనివాసరావుని తన లాగే డాక్టర్‌ని చేయాలని భావించారు. కానీ, మొదటి నుంచి కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న కోట శ్రీనివాసరావు, తొలుత రంగస్థలంపై నటించారు. ఎన్నో నాటికలు, నాటకాలను పదేపదే వేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయనకు 'ప్రాణం ఖరీదు' సినిమాలో అవకాశం వచ్చింది.
'ఎవరో కోట శ్రీనివాసరావుట... స్టేజి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చి నటించేస్తున్నాడు' అంటూ టాక్ మొదలైంది. ఆ వరుసలోనే 'మూడు ముళ్ళు', 'దేవాంతకుడు', 'బాబాయ్ అబ్బాయ్', 'తాండ్రపాపారాయుడు' లాంటి చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాలన్నీ కోటలోని నటుడిని వెలికి తీశాయి. అంతేనా! అగ్ర దర్శకులందరితో ఆయన పనిచేశారు. ప్రత్యేకించి దర్శకులు రాఘవేంద్రరావు, టి.కృష్ణ, జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, విజయ్ భాస్కర్... లాంటి దర్శకుల చిత్రాల్లో క్లిష్టతరమైన పాత్రలు వేసి పేరు తెచ్చుకున్నారు.
'ప్రతిఘటన' మేలిమలుపు
ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన 'ప్రతిఘటన' చిత్రం కోట శ్రీనివాసరావులోని నటనకి పరాకాష్టగా నిలిచింది. సమాజంలో అవినీతి, రాజకీయాల్లో నేరప్రవృత్తిపై దర్శకుడు టి.కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'ప్రతిఘటన'. విజయశాంతి నాయిక. కోట శ్రీనివాసరావు రాజకీయనాయకుడిగా తెలంగాణ మాండలికంలో అదరగొట్టారు. ఎంవీఎస్ హరనాథరావు పదునెక్కిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో...' అనే పాటకి నేపథ్య గాయని నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నటిగా విజయశాంతి కూడా నంది అవార్డుని స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా 'ప్రతిఘటన' అనేక అవార్డులను పొందింది. ఈ సినిమా కోట నట జీవితానికి గట్టి పునాదిని వేసింది.
'అహ నా పెళ్లంట' కమెడియన్‌గా..
సీరియన్ విలన్‌గా రాణిస్తున్న సమయంలోనే జంధ్యాల హాస్య నటుడిగా కోట శ్రీనివాసరావును మరో కోణంలో చూపించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. డాక్టర్ రామానాయుడు నిర్మించిన 'అహ నా పెళ్లంట' చిత్రంలో పిసినారిగా కోట ప్రదర్శించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.
'సాహసం సేయరా డింభకా', 'చూపులు కలసిన శుభవేళ', 'ప్రేమా జిందాబాద్', 'హై హై నాయకా', 'బావ బావ పన్నీరు', 'జయమ్ము నిశ్చయమ్మురా'... ఇలా జంధ్యాల మార్క్ సినిమాల్లో హాస్యాన్ని పండించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రౌడీ అల్లుడు', 'సుందర కాండ', 'బొంబాయి ప్రియుడు', 'అన్నమయ్య' లాంటి చిత్రాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారు.
విభిన్న పాత్రల్లో
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలోని ఎన్నో చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 'గాయం', 'గణేష్' చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఓవైపు సీరియస్ విలన్‌గా, మరోపక్క నవ్వులు పండించే హాస్య నటుడిగా కోట శ్రీనివాసరావు నటనని అభిమానించే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. 'అత్తారింటికి దారేది', 'దూకుడు', 'రక్త చరిత్ర', 'లీడర్', 'రెడీ', 'సర్కార్', 'బొమ్మరిల్లు', 'అతడు', 'మల్లీశ్వరి', 'ఠాగూర్', 'ఇడియట్', 'స్టూడెంట్ నంబర్ 1', 'అనగనగా ఒకరోజు', 'ఆమె', 'హల్లో బ్రదర్', 'గోవిందా గోవిందా', 'మనీ', 'శత్రువు', 'శివ' లాంటి చిత్రాల్లో కోట నటన శిఖర సమానం.