చిత్రం: సెబాస్టియన్ పీసీ524; నటీనటులు: కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా తదితరులు; సంగీతం: జిబ్రాన్; ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి; దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి; నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు; విడుదల తేదీ: 04-03-2022
'రాజావారు రాణీగారు', 'ఎస్.ఆర్.కల్యాణ మండపం' సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన నుంచి వచ్చిన మూడో చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524'. బాలాజీ సయ్యపురెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో కిరణ్ రేచీకటి సమస్య ఉన్న కానిస్టేబుల్‌గా నటించడం.. ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా ఉండటం వల్ల సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను సెబాస్టియన్ అందుకున్నాడా? అసలతని కథేంటి? రేచీకటి సమస్యతో అతడు పడిన పాట్లేంటి? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే: మదనపల్లి నేపథ్యంలో సాగే.. సెబాస్టియన్ అనే ఓ రేచీకటి కానిస్టేబుల్ కథ ఇది. తనకు రేచీకటి ఉందన్న నిజాన్ని దాచి పెట్టి ఉద్యోగం సంపాదిస్తాడు సెబా. తన చుట్టూ ఉన్న వాళ్లని మేనేజ్ చేస్తున్నట్లుగానే.. ఏదోలా ఉద్యోగాన్ని కూడా మేనేజ్ చేసేద్దాం అనుకుంటాడు. ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కొన్ని రోజులు బాగానే సాగిపోతుంది. కానీ, తనకున్న సమస్య వల్ల ఓరోజు ఆపదలో ఉన్న నీలిమ(కోమలీ ప్రసాద్) అనే మహిళను కాపాడలేకపోతాడు. అంతేకాదు ఆ హత్య కేసును విచారించే క్రమంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆ హత్యకు సంబంధించిన ఆధారాలు మిస్సవుతాయి. ఫలితంగా అతను సస్పెండ్ అవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? 'ఉద్యోగం గొప్పదా.. న్యాయం గొప్పదా' అనే ప్రశ్న తలెత్తినప్పుడు హీరో ఏం చేశాడు? కోమలి హత్య ఛేదించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? అసలు ఆమెను హత్య చేసిందెవరు? ఈ కేసుకు సెబా ప్రేయసి హేలి (నువేక్ష)కి ఉన్న లింకేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: రేచీకటి సమస్య ఉన్న ఓ కానిస్టేబుల్.. తనకున్న సమస్య వల్ల ఆపదలో ఉన్న ఓ మహిళను కాపాడలేకపోవడం.. ఈ క్రమంలో జరిగిన మరో పొరపాటు వల్ల ఆ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోవడం.. ఇలా లైన్‌గా చూస్తున్నప్పుడు ఓ ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన ముడిసరకంతా సెబాస్టియన్‌లో ఉన్నట్లే కనిపిస్తుంది. పైగా హీరోకున్న లోపం నుంచి కావాల్సినంత వినోదం పిండుకునే అవకాశం కూడా ఉంది. ప్రచార చిత్రాలు చూస్తున్నప్పుడు దర్శకుడు వీటిని సరైన రీతిలోనే మేళవించి, తెరపై ఆవిష్కరించినట్లు అనిపించింది. కానీ, ప్రచార చిత్రాల్లో కనిపించిన థ్రిల్లింగ్ మూమెంట్స్ వెండితెరపై ఎక్కడా కనిపించలేదు. కోమలీ నేపథ్యం నుంచి సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రేచీకటి లోపం వల్ల సెబాస్టియన్ నైట్ డ్యూటీలో పడే ఇబ్బందులు నవ్వులు పూయిస్తాయి. ఆరంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత సాగే కథనం కాస్త సహనానికి పరీక్షలా ఉంటుంది. సెబా మదనపల్లికి ట్రాన్స్‌ఫర్ అయ్యాకే మళ్లీ కథలో కాస్త వేగం పెరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఓరోజు అతను పోలీస్ స్టేషన్‌లో నైట్ డ్యూటీ చేయాల్సి రావడం.. అదే రోజు రాత్రి కోమలీ హత్యకు గురవడంతో సినిమా ఒక్కసారిగా థ్రిల్లర్ జానర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. అయితే ఆ తర్వాత నుంచి మరింత ఆసక్తికరంగా సాగుతుందనుకున్న కథనం.. పూర్తిగా గాడి తప్పుతుంది. ఆ కేసును ఛేదించే క్రమంలో సెబా చేసే ప్రయత్నాలేవీ ఆసక్తికరంగా ఉండవు. సరిగ్గా విరామ సమయానికి ఈ కేసుతో తన ప్రేయసికి, మిత్రుడికి, కోమలీ మామకు సంబంధం ఉందని సెబాస్టియన్ కనిపెట్టడంతో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరుగుతుంది.
కానీ, ద్వితీయార్ధం ఆరంభంలోనే సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు ఆ కేసును కొట్టేయడం.. కోమలీ కుటుంబ సభ్యులు కూడా ఆ కేసును చాలా లైట్‌గా తీసుకోవడం వల్ల కథనం ఏమాత్రం ఆసక్తికరంగా ముందుకు సాగదు. పైగా కోర్టు కొట్టేసిన.. ఎవరూ పట్టించుకోని ఈ కేసు కోసం సెబాస్టియన్ దేవదాస్‌లా మారిపోవడమన్నది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆఖరి పది నిమిషాల్లో కేసును చకచకా ఓ కొలిక్కి తీసుకొచ్చి సినిమాని ముగించిన తీరు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించదు.
ఎవరెలా చేశారంటే: సెబాస్టియన్ పాత్రకు కిరణ్ తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. రేచీకటి లోపంతో ఇబ్బందిపడే కానిస్టేబుల్‌గా అతడి నటన మెప్పిస్తుంది. ఆ పాత్ర తర్వాత సినిమాలో కాస్త ఎక్కువ మార్కులు పడింది ఎస్సైగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్‌కే. సినిమాలో నాయికలిద్దరి పాత్రలు పూర్తిగా తేలిపోయాయి. బాలాజీ ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా అనిపిస్తుంది. జిబ్రాన్ సినిమాకి తన సంగీతంతో ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటిని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. రాజ్ కె.నల్లి ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
బలాలు:
+ కథా నేపథ్యం
+ కిరణ్ నటన
+ పాటలు, నేపథ్య సంగీతం
బలహీనతలు:
- కథనం
- ప్రథమార్ధం
చివరిగా: నిరుత్సాహపరిచే సెబాస్టియన్..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
ఇదీ చదవండి: విభిన్న కాన్సెప్ట్‌తో 'హే సినామిక'.. అంచనాలను అందుకుందా?