Sarvanand Rashmika Adavallu Meeku Joharlu: నా కెరీర్‌లోనే ఇదొక అత్యుత్తమమైన సినిమాగా నిలిచిపోతుందన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక కథానాయిక. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్, నాయికలు కీర్తిసురేష్, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంయుక్తంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నాకు ఆస్కార్ వద్దు... సినిమా ఆడితే చాలు’, ‘మీరేమో పెళ్లి అనే పరీక్షని లాక్‌డౌన్‌లో స్టూడెంట్స్‌లా రాయకుండానే పాస్ అయిపోయి, నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా?’ అనే సంభాషణలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. వేడుకనుద్దేశించి శర్వానంద్ మాట్లాడుతూ ‘‘నాకు బాగా ఇష్టమైన నిర్మాత సుధాకర్ వల్లే ఈ సినిమా చేశా. మంచి సినిమాని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బలమైన కుటుంబ వినోదం ఇందులో చూస్తారు. రష్మికతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దేవిశ్రీప్రసాద్ చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ "నా కుటుంబ వేడుకకి వచ్చినట్టే ఉంది. ‘పడి పడి లేచే మనసు’ చేసినప్పట్నుంచి నిర్మాతలు నా కుటుంబ సభ్యులు అయిపోయారు. శర్వానంద్ ఒక హీరో అయిపోయానని కాకుండా... తను ఇంకా బాగా వినోదం పంచాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. పుష్ప’తో విజయం అందుకున్న రష్మికకు ఈ సినిమాతో మరో విజయం దక్కాలని ఆశిస్తున్నా" అన్నారు.
రష్మిక మాట్లాడుతూ "కొవిడ్ వల్ల నిరాశలో ఉన్న మనందరికీ వినోదం పంచే చిత్రమిది. దర్శకుడు కిషోర్‌కి కృతజ్ఞతలు ఈ సినిమా ఇచ్చినందుకు. శర్వా నేను కలిసిన హీరోల్లో ఓ స్వీట్ పర్సన్. ఆడవాళ్లంతా కలిసి చాలా సరదాగా చేశామ"న్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సుకుమార్ మాట్లాడుతూ "అందమైన కథానాయికలు రష్మిక, కీర్తిసురేష్, సాయిపల్లవి. సమంత గ్యాంగ్‌లీడర్. సాయిపల్లవి లేడీ పవన్‌కల్యాణ్‌లా కనిపిస్తున్నారు. ప్రకటనల్ని తిరస్కరించే విషయంలో ఆమె ఆదర్శంగా నిలుస్తారు. తను మంచి నటి మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. లేడీ పవన్‌కల్యాణ్ అనుకుంటా. ఈ రంగంలో తనలా ఉండటం కష్టం. నాకు ఇష్టమైన దర్శకుడు తిరుమల కిషోర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. శర్వానంద్‌కి పెద్ద అభిమానిని. గత సినిమాల్లో సీరియస్‌గానే కనిపించాడు. కానీ ఇందులో నవ్వుతూ బాగా చేశాడ"న్నారు. ‘‘తిరుమల కిషోర్ నా తొలి సినిమా దర్శకుడు. కిషోర్ పేరు కనిపించకపోయినా తన సినిమాని గుర్తుపట్టొచ్చు. రష్మిక కెరీర్ ఆరంభం నుంచే తగ్గేదే లే అన్నట్టుగా సాగుతోంది. ఆడవాళ్లకి మాత్రమే కాదు, సినిమాలో పనిచేసిన అందరికీ నా జోహార్లు’’ అన్నారు కీర్తిసురేష్. కార్యక్రమంలో ఖుష్బూ, దేవిశ్రీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, శ్రీకాంత్, ప్రకాశ్, శ్రీకర్ ప్రసాద్, విజయ్ కుమార్ చాగంటి, వాసు, వరంగల్ శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అలరిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్.. హిందీలో రామ్-నితిన్ హవా!