Sampoornesh Babu New Movie: "నేను తెరపై ఎంత అతి చేస్తే అంతగా నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు దర్శకులు. మీరు చేయాల్సిన కథ అంటూ నా దగ్గరికొస్తుంటారు. ఆ కథల కోసం ఓ నటుడిగా నేనేం చేయడానికైనా సిద్ధమే" అంటున్నారు సంపూర్ణేష్ బాబు. 'హృదయ కాలేయం'తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ద్విపాత్రాభినయంతో 'క్యాలీఫ్లవర్' (Cauliflower Sampoornesh Babu) తెరకెక్కింది. ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ..
"శీలం అనేది ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకీ ముఖ్యమే. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావనే అంశం చుట్టూ ఈ కథని అల్లారు దర్శకుడు. ఆండీప్లవర్, క్యాలీఫ్లవర్ అనే రెండు పాత్రలు చేశాను. ఆ పాత్రల గురించి చెప్పినప్పుడు నాకేం అనిపించలేదు. వాటి లుక్స్ బయటికొచ్చాక నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కొద్దిమంది బంధువులు, స్నేహితులు క్యాలీఫ్లవర్ అడ్డు పెట్టుకుని కనిపించే లుక్ చూసి 'మరీ ఇలా చేశావేంది?' అన్నారు. వాళ్లు ఇంత సీరియస్‌గా తీసుకున్నారా? అని అప్పుడు అనిపించింది. 'పీకే'లో ఆమిర్‌ఖాన్ రేడియో అడ్డుపెట్టుకుని కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ అలా క్యాలీఫ్లవర్ అడ్డు పెట్టుకుని నటించింది నేనే. దర్శకుడు ఆర్కే ఎప్పట్నుంచో నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారట. ఆయన ఈ కథ చెప్పగానే నచ్చింది."
-సంపూర్ణేష్ బాబు, నటుడు
"నా పాత్రలు చేసే విన్యాసాలు పరాకాష్టలా అనిపిస్తాయి. ఆ ప్రయత్నమే ప్రేక్షకుల్ని నవ్విస్తోంది. తదుపరి సినిమాలో ఐదు పాత్రల్లో కనిపిస్తాను. ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా, రేపు ఇలాగే ఉంటామన్న ఓ నమ్మకమైతే నాలో ఉంటుంది. హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నా. నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయికి రావడం నా అదృష్టం. ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడంలో తెలియని సంతృప్తి లభిస్తోంది. అందుకే ఆ విషయంలో ముందుంటాను. ప్రస్తుతం తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నా. సాయిరాజేష్ అన్న, నేను కలిసి మళ్లీ 2022లో ఓ సినిమా చేస్తాం" అని సంపూ చెప్పారు.
ఇదీ చూడండి: 'అవి లేకపోయుంటే కాలో చెయ్యి విరిగేది'