సాహో.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మేనియా.. నేడు విడుదలవుతున్న ఈ సినిమా కోసం సగటు ప్రేక్షకుడు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. టిక్కెట్ల కోసం వేట మొదలు పెట్టారు.. తెలిసిన వాళ్లందరిని అడిగి ఎలాగోలా తొలిరోజే సినిమా చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఇన్ని అంచనాలతో విడుదల కానున్న సాహో చిత్రం గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
దాదాపు రూ. 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..
రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సాహోకు విడుదలకు ముందే పెట్టుబడిని రాబట్టుకుంది. థియరిటికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్, మ్యూజికల్ హక్కులు తదితర రూపాల్లో ఇప్పటికే రూ. 290 కోట్లను రాబట్టుకుంది. సినిమా మంచి టాక్ తెచ్చుకుని విజయం సాధిస్తే రూ. 500 కోట్ల మార్కును అవలీలగా దాటే అవకాశం కనిపిస్తోంది. రోబో 2.0, బాహుబలి2 సినిమాల అనంతరం అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా అవతరించింది.
తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెంపు..
తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా కోసం టిక్కెట్ల దరలు పెరిగాయి. కోర్టు ఉత్తర్వుల ద్వారా ఏపీ, తెలంగాణల్లో 'సాహో' టికెట్ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారానికే పరిమితం అవుతాయి. తర్వాత సాధారణ ధరల్లో లభిస్తాయి.
సొంత ఎమోజీ కలిగిన ఏకైక తెలుగు చిత్రం..
ట్విట్టర్లో సొంత ఎమోజీ కలిగిన ఒకే ఒక్క తెలుగు చిత్రంగా సాహో రికార్డు సృష్టించింది. రజినీకాంత్ కబాలి, షారుఖ్ జీరో తర్వాత ఈ ఘనత సాధించిన హీరో ప్రభాసే. అంతర్జాలంలో ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది.
బరువు తగ్గిన ప్రభాస్..
బాహుబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్ సాహో చిత్రం కోసం 10 కేజీల బరువు తగ్గాడు. పోలీసు పాత్రకు తగినట్లుగా శరీరాకృతిని మార్చుకున్నాడు డార్లింగ్. ఇందుకోసం స్విమ్మింగ్, సైక్లింగ్‌తో పాటు జిమ్‌లో చెమటోడ్చాడు.
అత్యధిక బుకింగ్స్ నమోదైన చిత్రంగా రికార్డు..
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాహో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో బుకింగ్ యాప్స్‌లో ఎక్కువ సేపు ఈ సినిమా కోసం ఎదురు చూశారు మూవీ లవర్స్. అత్యధిక బుకింగ్స్ నమోదైన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది సాహో.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌తో పోరాటాల చిత్రీకరణ..
ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది సినిమాలో పోరాటాలు ఏ స్థాయిలో ఉన్నాయో! హాలీవుడ్ చిత్రాలకు దీటుగా పోటీపడుతున్న సాహో చిత్రంలో ఫైట్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కెన్నీ బేట్స్ రూపొందించారు. ఈ సినిమాలో తన కెరీర్లోనే అత్యుత్తమ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించానని బేట్స్ చెప్పడం విశేషం.
24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు పొందిన సాంగ్..
సాహోలోని బ్యాడ్‌బాయ్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు అందుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన పాటగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రియాలో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ జతకట్టింది. అమ్మాయిల బికినీలతో డార్లింగ్ స్టైలిష్ స్టెప్పులతో, జాక్వలిన్ మత్తెక్కించే సొగసులతో కుర్రకారును ఉర్రూతలూగించిందీ పాట.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ నిర్మించారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మురళీశర్మ, అరుణ్‌విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించారు.
ఇది చదవండి: అతిపెద్ద థియేటర్‌ను ప్రారంభించిన 'అల్లూరి'