సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలతో 28 రోజులపాటు జైలు జీవితాన్ని గడిపిన రియా చక్రవర్తికి ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె బుధవారం సాయంత్రం బైకుల్లా జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో ఇంతకాలం జైలులో ఉన్న రియా ఇంటికి చేరుకోగానే తన కుటుంబసభ్యులను చూసి.. 'మీరెందుకు బాధగా ఉన్నారు?' అని అడిగారు. ఈ విషయాన్ని రియా తల్లి సంధ్యా చక్రవర్తి తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"మా.. మీరెందుకు బాధగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. మన ముందు ఉన్న సమస్యలను ఎదుర్కోవాలి' అని ఇంటికి రాగానే రియా నాతో చెప్పింది. మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ ఆమె భరించింది. గత కొన్నిరోజులుగా తాను పడుతున్న బాధ నుంచి రియా ఎలా బయటకు వస్తుందా? అని మేము ఆలోచిస్తున్నాం. రియా త్వరగానే మానసికంగా కుదుటపడుతుందనే గట్టి నమ్మకం నాకుంది. కావాలంటే నా కుమార్తె తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే విధంగా తనకి ఏదైనా చికిత్స ఇప్పిస్తాను" అని రియా తల్లి సంధ్యా చక్రవర్తి వెల్లడించారు.
జైలులో రియా యోగా..!
ఎన్సీబీ విచారణలో భాగంగా జైలులో ఉన్నన్ని రోజులు రియా యోగా చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. యోగా వల్లే ఆమె మానసికంగా బలంగా ఉన్నారని.. పలువురు చేసిన ఆరోపణల్ని తట్టుకోగలిగినట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి షారుక్- అట్లీ సినిమాకు రెహమాన్ సంగీతం!