కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుంటారు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja). ఆయన కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయితగా నిరూపించుకున్న శరత్ మండవ(Sarath Mandava)కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కలయికలో చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది.
అప్పట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు దర్శకుడు శరత్. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. స్వరకర్త స్యామ్ సీఎస్ నేతృత్వంలో ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. 1990లనాటి లుక్ కోసం రవితేజ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆయన కనిపించే విధానం కొత్తగా, ఇదివరకెప్పుడూ కనిపించని రీతిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో రవితేజకు జోడీగా ఇద్దరు కథానాయికలు నటిస్తారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik). మరొకరి ఎంపికపై దృష్టిపెట్టింది చిత్రబృందం. తమిళ చిత్రం 'కర్ణన్'లో నటించిన రాజీషా విజయన్(Rajisha Vijayan) పేరునూ పరిశీలించినట్టు తెలిసింది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి సత్యన్ సూరన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇదీ చూడండి: శంకర్ సినిమాలో యంగ్ లీడర్‌గా చరణ్?