'నేనే రాజు నేనే మంత్రి'తో సోలో కథానాయకుడిగా రానా కెరీర్‌కు బిగ్గెస్ట్ హిట్‌ను ఇవ్వడమే కాక.. తన వరుస ఫ్లాప్‌లకు చెక్ చెప్పుకున్నాడు దర్శకుడు తేజ. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ ఇద్దరూ మరోసారి తెరపైకి రాబోతున్నట్లు సమాచారం.
తేజ ఈసారి రానా కోసం ఓ అదిరిపోయే డార్క్ థ్రిల్లర్‌ను సిద్ధం చేసి పెట్టాడట. ఇప్పటికే అతడికి కథ వినిపించి ఓకే చేయించుకోవడం కూడా జరిగిపోయిందంటున్నారు. దీనికి 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను బట్టి చూస్తుంటే ఈ చిత్రంలో రానాది ప్రతినాయక ఛాయలున్న పాత్రగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చేస్తున్నాడు. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' చేయనున్నాడు. ఇది వేసవి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తర్వాత తేజతో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్లవచ్చు.
ఇవీ చూడండి.. అల్లు అర్జున్ ఇంట విషాదం.. 'ఏఏ20' నిర్మాత మృతి