ఎన్టీఆర్ - రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో.. అబ్బురపరిచే సెట్స్ నిర్మించారు. అందులో షూట్ చేస్తున్న భారీ పోరాట ఘట్టాలు ప్రేక్షకులకు కనులవిందును అందించబోతున్నాయట. సినిమా మొత్తం బడ్జెట్‌లో ఎక్కువ శాతం దీనికే ఖర్చు చేయనున్నట్లు ఇది వరకే వార్తలొచ్చాయి.
తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో పాటలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుందట. ముఖ్యంగా చరణ్ - తారక్‌లపై చిత్రీకరించబోయే టైటిల్ పాట కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఓ పాట కోసం ఈస్థాయిలో ఖర్చు పెట్టడం జక్కన్నకు కొత్తేమీ కాదు.
![rajamouli rrr movie song at cost of 3 crores!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3729565_rrr.jpg)
గతంలో 'బాహుబలి 1'లో 'పచ్చబొట్టేసినా..' బాహుబలి 2లో 'హంస నావ...' పాటల కోసమూ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు దర్శకధీరుడు. అయితే ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్'లో చేయబోయే టైటిల్ పాట మాత్రం వీటన్నింటినీ మించే స్థాయిలో ఉండనుందట. మరి ఇది తెరపై ఎలా ఉంటుందో చూడాలంటే.. వచ్చే ఏడాది జులై 30 వరకు వేచి చూడక తప్పదు. ఇందులో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ దర్శనమివ్వనున్నాడు.