'నటనే రాని స్టార్ కిడ్' అన్న పేరు నుంచి నటనలో 'సూపర్‌స్టార్' అనిపించుకున్నాడు. చేసేది మలయాళ చిత్రాలే అయినా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో 'పుష్ప'తో(Pushpa Movie) తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టబోతున్న ఫహద్ ఫాజిల్.. తన ఇష్టాయిష్టాల్ని పంచుకున్నాడిలా..
చదువు!
అలప్పుళలోని ఎస్‌డీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. మొదటి సినిమా తర్వాత అమెరికా వెళ్లి 'యూనివర్సిటీ ఆఫ్ మియామీ'లో ఫిలాసఫీలో ఎంఏ చేశా. ఇప్పుడు దాన్ని పక్కనుంచి ప్రతి స్క్రిప్టునూ పాఠంగా చదువుతున్నా.
డబ్బింగ్ సినిమాలు చూడను..
ఏ భాషలో తీసిన సినిమా ఆ భాషలోనే చూస్తుంటా. రీమేక్ చేసిన చిత్రాలు ఒరిజినల్ సినిమా ప్రభావంతో ఉండాలి కానీ సేమ్ టూ సేమ్ ఉండటం ఇష్టముండదు.
అదృష్టవశాత్తు బతికిపోయా..
ఈ మధ్య ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. 'మలయాన్ కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయా. పడుతున్నప్పుడు తల నేలకు కొట్టుకోకుండా చేతులు ఆనించడం వల్ల గాయాలతో బయటపడ్డా.
అందుకే కనిపించను!
సినిమా ప్రమోషన్స్‌లో అసలు కనిపించవెందుకని అందరూ నన్ను అడుగుతుంటారు. ఏ మూవీ తర్వాతైనా సరే, ఆ రోల్ నేను ఇంకా బెటర్‌గా చేసుండాల్సింది అనుకుంటా. ఆ ఫీలింగ్ వల్లే బయట కనపడను.
తొలి పరిచయం!
నాన్న ఫాజిల్ తమిళ, మలయాళంలో పేరున్న దర్శకుడు. ఆయన 2002లో తీసిన 'కైయెట్టుమ్ దూరత్తు' చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులో మొదటిసారిగా మలయాళ ప్రేక్షకులకు పరిచయమయ్యా. ఆ సినిమా ద్వారా అందర్నీ మెప్పించలేకపోయా. దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నా. సినిమా ఫెయిల్యూర్‌కు నేనే కారణం అని చెప్పి అమెరికా వెళ్లి చదువు కొనసాగించా.
హోంవర్క్‌లేమీ ఉండవ్!
నటించడం తప్ప సినిమాకు సంబంధించిన ఏ క్రాఫ్టూ నాకు తెలియదు. నటనకు ముందుగా ప్రిపేర్ కానసలు. అయితే సెట్‌లో అందరితో ఇంటరాక్ట్ అవుతా. ఔట్‌పుట్ ఎలా రావాలో తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు నటించడానికి ప్రయత్నిస్తా.
నచ్చే నటులు!
మోహన్‌లాల్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఇర్ఫాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టం. అమెరికాలో ఉన్నప్పుడు 'యు హోతా తో క్యా హోతా' సినిమా చూశా. అందులో ఆయన నటన చాలా నచ్చింది. ఆ తర్వాత ఇర్ఫాన్ సినిమాలన్నీ వరసబెట్టి చూసేశా. నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయవి. ఒక్కమాటలో ఇర్ఫాన్ గురించి చెప్పాలంటే 'రియల్, ఒరిజినల్' అని చెబుతా.
తెలుగు విలన్‌గా..
'ట్రాన్స్', 'అనుకోని అతిథి', 'సూపర్ డీలక్స్' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో తెలుగువారి ముందుకొచ్చా. ఇప్పుడు 'పుష్ప' చిత్రం ద్వారా స్ట్రెయిట్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర గురించి దర్శకుడు సుకుమార్ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యా. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. టాలీవుడ్‌లో నా ఎంట్రీకి ఇది సరైన పాత్ర అనిపించింది.
ఓటీటీకి రుణపడి ఉన్నా!
నిజానికి నేను ఓటీటీ సంస్కృతికి థ్యాంక్స్ చెప్పాలి. అదే కరోనా సమయంలో మలయాళ ప్రేక్షకులతోపాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు చేరువ చేసింది. ఓటీటీలో విడుదలైన 'సీ యూ సీన్', 'ఇరుల్', 'జోజి', 'మాలిక్' చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
మళ్లీ తెరపైకి..
2009లో 'కేరళ కెఫె' మూవీ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చా. విభిన్న కథాంశాలూ, సరికొత్త పాత్రలూ ఎంచుకోవడం మొదలుపెట్టా. కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మాత్రం 2011లో వచ్చిన 'చాప్పా కురిసు'. ఆ తర్వాతే మంచి నటుడిగా గుర్తింపు వచ్చేసింది. 2012లో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయమ్' సినిమాకు మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకున్నా. 2017లో వచ్చిన 'తొండిదిముత్తాలమ్ దృక్‌సాక్షియుమ్' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నా.
నా ప్రేమ కథ!
నజ్రియా నజీమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 'బెంగళూర్ డేస్' సినిమా తీస్తున్నప్పుడు సహనటిగా ఇష్టపడ్డా. ఒకసారి ప్రేమలేఖలో ఉంగరం పెట్టి నజ్రియాకు ఇచ్చా. అక్కడే మా ప్రేమకథ మొదలైంది. అయితే దానికి ఆమె వెంటనే ఎస్ చెప్పలేదు. అలా అని నో కూడా చెప్పలేదు. అయినా ఆమె చుట్టూ తిరగడం నాకు చాలా నచ్చేది. తను ఓకే చెప్పాక నా జీవితమంతా మారి పోయినట్టు అనిపించింది. నేను సాధించే ప్రతి విజయంలో ఆమె పాత్ర ఉంది. ఆమె సహకారం లేనిదే ఒంటరిగా నేను ఏ పనీ చేయలేను. ఇద్దరం కలిసే 'ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్' నిర్మాణ సంస్థను మొదలు పెట్టాం.
ఇదీ చూడండి.. Dear Megha: ఆ వయసులోనే అతడితో ప్రేమలో పడ్డా!